వీడిన కారు దగ్ధం కేసు మిస్టరీ
కేసును ఛేదించిన పోలీసులు
ఆర్థిక లావాదేవీలతోనే శ్రీనివాస్ హత్య
పోలీసులు అదుపులో ముగ్గురు నిందితులు
మెదక్,ఆగస్ట్11(జనం సాక్షి): మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పరిధిలో జరిగిన కారు దగ్ధం కేసును పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్థిక లావాదేవీలే హత్యకు గల కారణమని పోలీసులు నిర్దారించారు. కారులోనే శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి చంపిన నిందితులు మృతదేహాన్ని డిక్కీలో వేసుకుని 6 గంటలపాటు కారులోనే తిరిగారు. అనంతరం కారుకు నిప్పటించి పరారయ్యారు. శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణమని, లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించలేదనే కోపంతో హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. రూ.15 లక్షలు సుపారీ తీసుకుని దుండగులు శ్రీనివాస్‌ను హత్య చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నట్లు సమాచారం. వీరిని విూడియా ముందుకు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. వెల్దుర్తి నర్సాపూర్ ప్రధాన రహదారిలో మంగళపర్తి గ్రామ శివారులో ప్రధాన రహదారి పక్కన సోమవారం రాత్రి 10:30 సమయంలో కారు తగలబడడాన్ని మంగళపర్తి గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ మొదట గుర్తించి తగలబడుతున్న ఆ కారు దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అదేరాత్రి గ్రామానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. స్థానిక సర్పంచ్ రామకృష్ణారావు ఇచ్చిన సమాచారంతో మంగళవారం ఉదయం వెల్దుర్తి ఎస్‌ఐ మహేందర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా కారు డిక్కీలో శ్రీనివాస్ మృతదేహం కన్పించింది. దీంతో మెదక్ పట్టణంలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన పోలీసులు కుటుంబసభ్యుల నుంచి కొంత సమాచారం సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడం, శరీరంపై ఆనవాళ్లు కూడా సరిగా కన్పించకపోవడంతో వైద్య సిబ్బంది సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. శ్రీనివాస్‌కు మూడు పెట్టుడు దంతాలు ఉన్నాయని వైద్యులు నిర్దారించారు. అనంతరం మృతదేహం తన భర్తదేనని, వివాహేతర సంబంధాల వల్ల తమ మధ్య తరచు గొడవలు జరిగేవని చెప్పింది.
ఇద్దరు మహిళలతో తన భర్తకు సంబంధం ఉందని, వారి కుటుంబసభ్యులే ఈ హత్య చేసి ఉంటారని శ్రీనివాస్ భార్య లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న గొడవలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చని ఆమె పేర్కొంది. అయితే హత్యకు గురైన ధర్మకారి శ్రీనివాస్ మరొకరు కలిసి రూ. కోటిన్నర లోన్ తీసుకున్నారు. రూ. కోటిన్నర డబ్బులు లోన్ కట్టే వ్యవహారంలో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో గత కొన్ని రోజులుగా శ్రీనివాస్ లోన్ కట్టడకపోవడంతో శ్రీనివాస్ పై పార్ట్ నర్ కోపం పెంచుకున్నాడు. శ్రీనివాస్ పై కక్ష పెంచుకుని సుపారి ప్లాన్‌తో హత్య చేయించాడు. మంగళవారం సాయంత్రం దుండగులు రామాయంపేట రూట్‌లో అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం కారులోనే దుండగులు శ్రీనివాస్ డెడ్ బాడీతో ఆరుగంటల పాటు కారులోనే తిరిగినట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు.