వీరంగం చేసిన హెడ్‌కానిస్టేబుల్ సస్పెన్షన్
డిజిపి ఆదేశాలతో చర్య తీసుకున్న అధికారులు
గుంటూరు,సెప్టెంబర్4(జనం సాక్షి): గుంటూరులోని నగరపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఓ మహిళను చెప్పుతో కొట్టిన హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకొచ్చిన మహిళలపై వెంకటేశ్వరరావు మద్యం మత్తులో చెప్పుతో కొట్టిన దృశ్యాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం డీజీపీ ఆర్పీ ఠాకూర్ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. గుంటూరు నగరంలోని కొండావెంకటప్పయ్య కాలనీకి చెందిన కొందరు మహిళలను హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు విచారణ పేరిట ఆదివారం స్టేషన్‌కు తీసుకొచ్చారు. రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆయన మహిళల వద్దకు వచ్చి వీరంగం సృష్టించాడు. ఓ మహిళను చెప్పుతో కొట్టాడు. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు ఫొటోలు తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్టేషన్‌లో ఎవరి అనుమతి లేకుండానే హెడ్ కానిస్టేబుల్ మహిళలను స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన డీజీపీ దృష్టికి వెళ్లడంతో ఉన్నతాధికారులు వెంకటేశ్వరరావుపై వెంటనే చర్యలు తీసుకున్నారు.