వెంకట్రాంపురం నుండి జగ్నా తండాకు రహ(దారేది)!?
బయ్యారం,జులై20(జనంసాక్షి):
మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం పంచాయతీ పరిధిలోని జగ్నాతండాకు వెళ్లే దారి అస్తవ్యస్తంగా ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా సరైన రహదారి కోసం పరిష్కార మార్గం దిశగా అడుగులు పడట్లేదు.చినుకు పడితే చాలు బురదమయంగా మారే రహదారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని గ్రామస్థులు వాపోతున్నారు.తండా వాసుల అవస్థలపై జనంసాక్షి దృష్టి సారించి,పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లేప్రయత్నం చేసింది. ఈ సందర్బంగా బాధిత తండా వాసులు మాట్లాడుతూ…గత 50 సంవత్సరాలనుండి ఈ దారి ఉన్నప్పటికీ ఎటువంటి పక్కా రహదారిలేదని,1996 లో అప్పటి ఎమ్మెల్యే ఊకె అబ్బయ చెరువు కట్టకోసం పోసిన మట్టి దారితోనే కాలం వెళ్ళాదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో తాము వెంకట్రాంపురంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళినప్పుడు బురదలో, గతుకుల దారిలో భయం భయంగా వెళ్లామని,ఇప్పుడు తమ మనుమడు,మనుమరాలు కూడా అదే దయనీయ స్థితిలో వెళ్ళాల్సి వస్తుందని,దశబ్దాలు గడిచినా,పాలకులు మారినా,స్వరాష్ట్రం సిద్దించినా తండా కు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు.గర్భిణీ స్త్రీలు ఈ మార్గం గుండా వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితిలో చుట్టూ తిరిగి మండల కేంద్రానికి చేరుకునే లోపు పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉన్నదని వాపోయారు. బురదమయంతో ఉన్న ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని, ఇప్పటికైనా తనకు ఒక దారి చూపాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ స్వగ్రామానికి కూతవేటు దూరంలో ఉండే ఈ తండా పరిస్థితే ఇలా ఉంటే జిల్లాలో మిగిలిన తండాల సమస్యలు ఇంకెలా ఉన్నాయోనని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సమస్యపైన సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో లేదో వేచి చూడాలి