వెలిగొండ ప్రాజెక్టుపై..

ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి
– ప్రకాశం జిల్లా అభివృద్ధికి నోచుకోవటం లేదు
– తాగు, సాగునీరు సమస్య తీరాలంటే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి
– వైసీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలోపు ప్రాజెక్టును పూర్తిచేస్తాం
– వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం, ఆగస్టు15(జ‌నం సాక్షి) : ప్రకాశం జిల్లా ప్రాణధారమైన వెలిగొండ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యంవైఖరి విడనాడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రాజెక్టు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా చేపట్టిన పాద్రయాత్ర బుధవారం ప్రారంభమైంది. కనిగిరిలో బహిరంగ సభ అనంతరం వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.  జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో, 15 రోజుల పాటు సుమారు 200 కిలో విూటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు వద్ద చివరి రోజున పాదయాత్ర ముగియనుంది.
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా ఇంత వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందని అన్నారు. జిల్లా తాగు, సాగు నీరు సమస్య తీరాలని, అది వెలిగొండ ప్రాజెక్టుతోనే ఈ సమస్య తీరనుందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా రైతులను నట్టేట ముంచారని, వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబువి దొంగ మాటలని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలోని పూర్తిచేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హావిూ ఇచ్చారని, నాలుగేళ్లు గడిచిన ఇంత వరకు ప్రాజెక్టు పూర్తి కాలేదని మండిపడ్డారు. జిల్లా కరువు కొరల్లో చిక్కుకుందని, ఫ్లోరైడ్‌ నీళ్లు తాగి జనం పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం వైఖరిని ఎండగడుతూ పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే.. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఏడాదిలోపు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సుబ్బారెడ్డి హావిూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన పాదయాత్రకి మద్దతిస్తున్న అందరికి ధన్యావాదాలు తెలిపారు.

తాజావార్తలు