వెలిగొండ ముంపు బాధితుల పట్ల నిర్లక్ష్యం
భూములకు పరిహారం ఇవ్వకుండా అన్యాయం
వైకాపా అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం: వైవి
ఒంగోలు,ఆగస్టు 21(జనం సాక్షి): వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి విమర్శించారు. అసైన్డ్ భూముల పేరుతో రైతులకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపు గ్రామాల ప్రజా సమస్యలు ముందుగా పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.పాదయాత్రలో భాగంగా ఏడవ రోజు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రకాశం జిల్లా గుండెకాయ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని వారం రోజుల క్రితం పాదయాత్ర చేపట్టిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా కాకర్ల వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన సభలో వైవీ ప్రసంగించారు. వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రకు వైఎస్సార్‌సీపీ నేత ఆదిశేషగిరి రావు సంఘీభావం తెలిపారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జలకళ అని చంద్రబాబు అనడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ప్రకాశం జిల్లాలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతుంటే బాబు కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాన్ని కరవు కమ్మేసిందని, ఎ/-లోరిన్ దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు కాకమ్మ కథలు చెబుతున్నారని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై వాయిదాల విూద వాయిదాలు వేస్తున్నారని వెల్లడించారు. తాజాగా సంక్రాంతికి నీళ్లు ఇస్తానని చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. నాలుగు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యం. పాత కాంట్రాక్టర్లను తొలగించి చంద్రబాబు తన బినావిూలను పెట్టుకున్నాడు. చంద్రబాబూ అబద్దాలు మాని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయండి. నావిూద చౌకబారు ఆరోపణలు మానుకో.నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ, చంద్రబాబు బినావిూ. నలభై ఏళ్ల అనుభవంతో చంద్రబాబు కడుతున్న రాజధాని నేడు ముగిపోతుంది. నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు మానుకుంటా. ఎవరితోనైనా బాబు కాపురం చేయగలడు. కాంగ్రెస్‌తో, టీడీపీ కలవడంలో ఆశ్చర్యం లేదు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడ’ని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.