వేణుగోపాలచారిపైనే అందరి దృష్టి
ఆదిలాబాద్‌్, నవంబర్ 15 : మూడు దశాబ్దాల పాటు రాజకీయాలలో చక్రం తిప్పిన మాజీ కేంద్రమంత్రి, ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాల చారి ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ మూడు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వేణుగోపాలచారి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. పార్టీలో కీలక బాధ్యత వహించిన వేణుగోపాలచారి తెలంగాణ ఉద్యమ కారణంగా టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. అతనితోపాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పార్టీ నుంచిసస్పెండ్ అయి టీఆర్‌ఎస్‌లో చేరి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2009 ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌కు కేటాయించడంతో ముథోల్ నియోజకవర్గానికి మారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా వేణుగాపాల చారి గెలుపొందారు. అపర చాణుక్యుడగా పేరు పొంది జిల్లా టీడీపీని కనుసన్నల్లో నడిపిన వేణుగోపాలచారి పార్టీకి దూరమైనప్పటికీ ఇప్పటికీ ఏ పార్టీలో చేరక స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని కాంగ్రెస్, టీడీపీలో ఎంతో మంది నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కారణంగా ఇతర పార్టీలోకి మారినా చారి మాత్రం ఏ పార్టీలో చేరకుండటంతో జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వేణుగోపాల చారి టీఆర్‌ఎస్‌లో చేరుతారని ఊహాగానాలు వచ్చినప్పటికీ వీటికి తెరదించి ప్రజలు, అనుచరుల నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని చారి ప్రకటన చేసిన విషయం విదితమే. ఇటీవల వేణుగోపాల చారి బీజేపీ రాష్ట్ర నాయకులను కలుసుకోవడం, వారితో చర్చలు జరపడం వెనుక మళ్లీ ఆయన చేరికపై ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటి వరకు వేణుగోపాల చారి ఎలాంటి ప్రకటన చేయలేదు. టీడీపీ నుంచి దూరమైన నాయకులు ఆ పార్టీపై ఆరోపణలు సంధిస్తున్నా చారి మాత్రం ఎలాంటి విమర్శలు మాత్రం ఆరోపణలు చేయకపోవడంతో వేణుగోపాల చారి మళ్లీ టీడీపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఒ దశలో పార్టీలో నంబర్ 2 స్థానం అనిపించుకున్న వేణుగోపాల స్వామి భవిష్యత్తు రాజకీయాలపై జిల్లాలో వివిధ రకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.