వేదవిద్యార్థుల మృతికి మంత్రి వెల్లంపల్లి సంతాపం
జిజిహెచ్‌లో మృతదేహాలను పరిశీలించిన నేతలు
గుంటూరు,డిసెబర్11 (జనంసాక్షి) : కృష్ణానదిలో ఐదుగురు వేద పాఠశాల విద్యార్దులు, ఒక గురువు మృతిచెందడం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం జీజీహెచ్‌లో విద్యార్థుల మృతదేహాలను వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ముస్తఫా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహార్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్నానానికి దిగిన సమయంలో నీటిలో పడిపోయిన ఒక విద్యార్దిని కాపాడే ప్రయత్నంలో ఘటన జరిగిందన్నారు. శృంగేరి పీఠం అధికారులతో మాట్లాడానని… ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. విద్యార్థుల మృతి ఘటనతో వేద పాఠశాలలో విషాదం నెలకొంది. పాఠశాలలోని విద్యార్థులు, తోటి గురువులు వణికిపోయారు. మృతుల్లో ఎంపీకి చెందిన శివశర్మ ఏడేళ్లుగా, హర్షిత్ శుక్లా మూడేళ్లుగా, అనుష్‌మాన్ శుక్లా, నితీష్‌కుమార్ దీక్షిత్‌లు రెండేళ్లుగా, శుభం త్రివేది ఏడాదిగా ఇక్కడ వేద విద్య అభ్యసిస్తున్నారు. మృతులంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని తోటి విద్యార్థులు తెలిపారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు శనివారానికి గుంటూరు చేరుకునే అవకాశం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. స్థానానికి వెళ్లి ఆరుగురు మృత్యువాతపడటం దురదృష్టకరమని డీఎస్పీ విజయభాస్కరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లోతు ఎక్కువగా ఉన్న చోట దిగటం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందన్నారు. రోజూమాదిరిగానే శుక్రవారం సాయంత్రం 8 మంది విద్యార్థులు, గురువు స్నానానికి వెళ్లారు. వారిలో యూపీకి చెందిన అభిషేక్ దీక్షిత్, మధ్యప్రదేశ్‌కు చెందిన సూరపు శర్మ నది ఒడ్డునే కూర్చొన్నారు. అయితే గురువుతోపాటు హర్షిత్‌శుక్లా, శుభంత్రివేది, అనుష్‌మాన్‌శుక్లా, శివశర్మ, నితీష్‌కుమార్‌దీక్షిత్, నీటిలో దిగి ఓ ఇసుక దిబ్బ విూదకు చేరుకున్నారు. ఆ దిబ్బకు మరోవైపున దిగిన ఓ విద్యార్థి మునిగిపోతుండటంతో అతడ్ని కాపాడే ప్రయత్నంలో ఒకరివెంట ఒకరు ఏడుగురు నీటిలో మునిగిపోయారు. వీరిలో అనుపమ్‌శుక్లాకు ఈత రావటంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ఒడ్డున ఉన్న వారికి విషయం చెప్పాడు. దీంతో సవిూప ప్రాంతంలో చేపలు పట్టుకుంటున్న జాలర్లు నదిలో మునిగిన వారిని బయటకు తీసుకువచ్చారు. అప్పటికే వారంతా మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే సత్తెనపల్లి డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కరరెడ్డి, రూరల్ సీఐ సత్యనారాయణ, అచ్చంపేట ఎస్‌ఐ మణికృష్ణ తదితరులు సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాలను జీజీహెచ్‌కు తరలించారు. కృష్ణానదిలో జరిగిన దుర్ఘటన తెలియగానే కలెక్టర్ వివేక్‌యాదవ్ తీవ్ర దిగ్భార్రతికి గురయ్యారు. వెంటనే ఆయన రెవెన్యూ, పోలీసు అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు.