వేలది మందితో విద్యార్థుల భారీ ర్యాలీ

విజయనగరం, నవంబర్‌30(జనం సాక్షి) : ఎస్‌ఎఫ్‌ఐ 23వ రాష్ట్ర మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం విజయనగరంలో విద్యార్థులు కదంతొక్కారు. వేలాది మందితో భారీ ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల నినాదాలతో నగరం దద్దరిల్లింది. మధ్యాహ్నం 3.15 గంటలకు విజయనగరం రైల్వే స్టేషన్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ ముందు వరుసలో ఎన్‌సిసి విద్యార్థులు నడవగా, తరువాత వరుసలో ఎస్‌ఎఫ్‌ఐ మహిళా నాయకులు మహాసభల సూచికగా 23 జెండాలతో ముందుకు సాగారు. ర్యాలీకి అగ్రభాగాన ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి మయూక్‌ బిస్వాస్‌, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్నకుమార్‌, అశోక్‌లు నిలిచి ర్యాలీని ముందుకు నడిపించారు. రైల్వేస్టేషన్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ మయూరి కూడలి, ఆర్‌టిసి కాంప్లెక్సు, బాలాజీ కూడలి విూదుగా గురజాడ కళావేదిక వద్దకు చేరుకుంది. విద్యారంగాన్ని పరిరక్షించాలని, జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఎయిడెడ్‌ విద్యావ్యవస్థను కొనసాగించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, విద్యార్థి వ్యతిరేక విధానాలు విడనడాలని నినదించారు. ఎస్‌ఎఫ్‌ఐ, చేగువేరా జెండాలతో పట్టణమంతా కళకళలాడిరది. ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన పులివేషాలు నగర ప్రజలను ఆకట్టుకున్నాయి. సుమారు మూడు కిలోవిూటర్ల మేర వేలాది మంది విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ర్యాలీ చేయడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు క్రమశిక్షణగా ర్యాలీని రోడ్డుకు ఒక వైపున నడిపించి విజయవంతం చేశారు.