వేలానికి రూ. 320 కోట్ల వజ్రం
లండన్: తళతళలాడే స్పష్టమైన నీలి రంగు దీర్ఘచతురస్రాకారపు అతిపెద్ద వజ్రాన్ని వేలం సంస్థ క్రిస్టీ అమ్మకానికి పెట్టింది. 14.62 క్యారెట్ల బరువుగల ఈ వజ్రానికి ప్రామాణిక ధరను 320 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి అతిపెద్ద ఫ్యాన్సీ వజ్రం అమ్మకానికి తమ వద్దకు రావడం ఇదే మొదటి సారయితే లండన్‌లోని డైమండ్ సిండికేట్‌ను తన ఆధీనంలో ఉంచుకొని చక్రం తిప్పిన సర్ ఫిలిప్ ఓపెన్ హైమర్ పేరు మీద ఈ వజ్రం ఉండడం మరో విశేషమని వారు వివరించారు.
సర్ ఫిలిప్ కేమ్‌బ్రిడ్జ్ యూనివర్శిటీలో చదవుకోవడమే కాకుండా అక్కడి బాక్సింగ్ టీమ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ఆయన అనంతరం 1934లో కుటుంబపరంగా సాగుతున్న వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా బ్రిటీష్ సైన్యంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా పనిచేశారు. తిరిగి వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆ వ్యాపారంలో గొప్ప ఆర్కిటెక్ట్‌గా, మంచి నెగోషియేటర్‌గా పేరు తెచ్చుకున్న సర్ ఫిలిప్ మొత్తం లండన్‌లోని డమైండ్ సిండికేట్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.
రినౌన్ రేసు గుర్రం యజమానికిగా కూడా గుర్తింపు పొందిన సర్ ఫిలిప్‌కు 1970లో ‘నైట్‌హుడ్’ కూడా లభించింది. ఆయన వద్ద అతిపెద్ద రతనాల కలెక్షన్ కూడా ఉండేది. అంతటి పేరు ప్రఖ్యాతలుగల ఫిలిప్ పేరిట ఉన్న ఈ నీలిరంగు వజ్రానికి మంచి ధర పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు కలెక్టర్ వద్దనున్న ఈ వజ్రాన్ని మే 18వ తేదీన జెనీవాలో వేలం వేయనున్నారు.