వేళాపాళాలేని విద్యుత్ కోతలతో ఇక్కట్లు
ఆదిలాబాద్, అక్టోబర్ 18: రోజు రోజుకు విధిస్తున్న విద్యుత్ కోతలతో ప్రజలు బెంబేలెత్తున్నారు. జిల్లాలో అధికారికంగా 7 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తుండగా అనధికారికంగా వేళావేళాలేకుండా విధిస్తున్న కరెంట్ కోతలతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. మున్సిపాలిటీలలో 7 గంటలపాటు, మండల కేంద్రాల్లో 8 గంటలపాటు, గ్రామాలలో 12 గంటలపాటు కోతలు విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇందుకు విరుద్ధంగా కోతలు విధిస్తుండడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయి మూతపడుతుండగా పంటలు ఎండి పోవడం, వ్యాపారాలు ముందుకు సాగకపోవడం లేదు. రోజువారి కోట 4.514 మిలియన్ యూనిట్లు కాగా అదేస్థాయిలో వినియోగం ఉన్నప్పటికీ అధనంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కరెంట్ కోతలతో అన్ని రంగాలు కూదేలు అవుతున్నాయి. వర్షకాలంలో గంటల తరబడి కోతలు విధిస్తుండడంతో వేసవిలో మరింత ఎంత ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి 7 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడానికి ఈ కోతలు తప్పడం లేదని అధికారులు చెబుతున్నా వ్యవసాయ రంగానికి నిరాటంకంగా విద్యుత్ సరఫరా అమలు కావడం లేదు. పండుగ వేళలో విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అనేక కుటిర పరిశ్రమలపై ఆధాపడి జీవిస్తున్న ఎంతో మంది కోతల వల్ల ఉపాధి కోల్పోతున్నారు. చేతికి పంటలు వచ్చే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల నీరు ఇవ్వలేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో ఇంత దారుణంగా వ్యవహరించడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.