వైకాపాను నవరత్నాలు గట్టెక్కించేనా?
ఫలించని జగన్ దూకుడు రాజకీయాలు
విజయవాడ,సెప్టెంబర్5(జనం సాక్షి): ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నివేదికలు ఎలా ఉన్నాయన్నది రానున్న ఎన్నికల ఫలితాలు..వైకాపాకు దక్కే ఆదరణను బట్టి తెలుస్తుంది. అయితే మధ్యలో వచ్చిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోనేషన్ ఎన్నికల్లో వైకాపా భంగపడ్డ తరవాత పరీక్షకు మళ్లీ అవకాశాలు రాలేదు. పికె వచ్చాక పార్టీలో ఊపు వచ్చిందని అప్పట్లో చెప్పుకున్నారు. తాజాగా ఇప్పుడు నవరత్నాలు అంటూ ప్రచారం చేపట్టారు. అవే గట్టెక్కిస్తాయని భావించిన వైకాపా అధినేత జగన్ ఇప్పుడు పాదయాత్రలో ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ వాస్తవ పరిస్థితి, నాయకుల పనితీరు, వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇలా అన్ని అంశాల్లో లోతైన అధ్యయనం చేసిన ప్రశాంత్ టీం సమగ్ర నివేదికను పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డికి గతంలోనే అందజేసింది. ఈ నివేదిక అధారంగా పార్టీలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పనికిరాని కొందరు నేతలను మెల్లగా వదిలించుకోవాలని సూచించారు. పేరుకు పెద్ద నాయకులైనా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న, పార్టీకి పెద్దగా పనికిరాని నాయకులను మెల్లగా దూరం పెట్టాలని జగన్ నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూస్తే ఎవరు తాలో, ఎవరు గట్టి సరుకో తేలిపోయింది. ఓ రకంగా పార్టీలో ఉన్న వారంతా సత్తాలేని నాయకులే అని గమనించాల్సిన దుస్తితి ఏర్పడింది. వ్యూహాత్మకంగా రాజకీయాలు నడపడం కన్నా సవాల్ రాజకీయాలు చేయడం వల్లనే ప్రజల్లో వైకాపా ఆదరణ కోల్పోతోంది. బాబుపై వ్యతిరేకత ఎంతగా ఉన్నా ప్రజలు బెదిరింపులను సహించరని నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తేల్చింది. వైస్ హయాంలోఒక వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు జగన్ వెంటే ఉన్నారు. ఆనాడు అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేకతను మూటుగట్టుకున్న వారు కూడా ఉన్నారు. వైఎస్ క్యాబినెట్‌లో కీలక మంత్రిపదవులు నిర్వహించి కొందరు మంచి పలుకుబడి సంపాదించారు. ఫోక్స్‌వాగన్ కార్ల కుంభకోణంలో బొత్సపై, వాన్‌పిక్ భూములు, శ్రీకాకుళం గనుల తవ్వకాల అక్రమాల్లో ధర్మానపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కానీ వైస్సార్ వారిద్దరినీ వెనుకేసుకు రావడమే కాకుండా తిరిగి మంత్రి పదవులు ఇచ్చాడంటే ఆయన వద్ద వారికున్న పలుకుబడి అర్థం చేసుకోవచ్చు. వైఎస్ మరణానంతరం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఈ ఉత్తరాంధ్ర బ్రదర్స్ రెచ్చిపోయి దండుకోవడంతో ప్రజల్లో వీరిపట్ల చులకన భావం ఏర్పడింది. తరవాత వీరు కాంగ్రెస్‌ను వీడి జగన్ చెంత చేరారు. రోజా కూడా అలా చేరి నగరి నుంచి గెలుపొందారు. ఆనాటి టీమ్‌లో ఉన్న అంబటి రాంబాబు, చెవిరెడ్డి తదితరులు ఇప్పుడు జగన్ వెంట ఉన్నా లాభం లేకుండా పోయింది. ఆనాటి బెస్ట్ టీమ్ ఇప్పుడు విఫలం అవుతోంది. బలహీనంగా ఉన్న పార్టీ ఎదుగుదలకు వీరి అనుభవం పనికొస్తుందని జగన్ భావించి చేరదీసి ఉంటారు. అవినీతి నేతల భాగోతాలను మరిచిపోని ప్రజల్లో వారిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాని ప్రభావం పార్టీపై పడుతోంది. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అవినీతి కుంభకోణాలపై పోరాడుతున్న ప్రతిపక్షానికి తామే అవినీతి కూపమన్న విషయాన్ని మరచి విమర్శలు చేయడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా జరిగిందని గుర్తించడం లేదు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రతిసారి వైకాపాను టిడిపి ఇరకాటంలో పెడుతోంది. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా అనేకమంది అసంతృప్తి నేతలు వైసీపీ వైపు చూస్తున్నారని
చేసుకుంటున్న ప్రచారం కూడా బెడిసి కొట్టి 21మంది ఎమ్మెల్యేలు గోడదూకారు. ప్రజల పక్షాన పటిష్టమైన విపక్షంగా కూడా పనిచేయడం లేదు. ఇలాగే సాగితే వచ్చే ఎన్నికల్లో వైకాపా గట్టి పోటీ ఇస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి.
————-