వైకాపా బంద్‌తో.. స్తంభించిన ఏపీ


– తెల్లవారు జాము నుంచే రోడ్లపైకి వచ్చిన వైకాపా శ్రేణులు
– బస్‌ డిపోల వద్ద బైఠాయింపు
– ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
– ప్రధాన కూడళ్లలో ఆందోళనలు
– ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– పలు ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారిన బంద్‌
– వైకాపా ముఖ్య నేతలను పోలీస్‌స్టేషన్‌లకు తరలింపు
అమరావతి, జులై24(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా సాధనలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వైఎస్సార్‌సీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌ సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏపీ వ్యాప్తంగా బంద్‌ నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి బస్‌ డిపోల వద్ద, ప్రధాన రహదారుల్లో ఆందోళన నిర్వహించారు. డిపోల వద్ద బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. బంద్‌ సందర్భంగా ఆందోళను నిర్వహించిన ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు  వైకాపా నాయకులను గృహనిర్బంధంలో ఉంచింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరులో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెలేలు రోజా, నారాయణ స్వామిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రత్యేక ¬దా కోసం బంద్‌ పాటిస్తుంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటని రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచి వేయాలని చూడటం నీచమైన చర్య అని మండిపడ్డారు. ప్రత్యేక ¬దా కావాలని చంద్రబాబుకు లేదన్నారు. ఢిల్లీలో బీజేపీతో చంద్రబాబు లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. అవినీతిలో టీడీపీ కూరుకు పోయిందన్నారు. కుప్పం  వైఎస్సార్‌సీపీ ఇంచార్జి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. పలమనేరులో వైఎస్సార్‌సీపీ ఇంచార్జి వెంకటేశ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగింది. తుమ్మలగుంటలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి యంఆర్‌ పల్లె పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను స్టేషన్లు మారుస్తూ బంద్‌లో పాల్గొనకుండా చేశారు. సత్తెనపల్లి నుంచి ముప్పాళ్ల తీసుకెళ్లారు. తర్వాత రాజుపాలెం పీఎస్‌కు తరలించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని నరసరావు పేట నుంచి నాదెండ్ల పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదేవిధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్‌ కొనసాగింది. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌ ఆధ్వర్యంలో నాలుగు గంటల నుంచే  బస్టాండు ఎదుట కార్యకర్తలు ధర్నాకు దిగారు. వినుకొండ సమన్వయకర్త బొల్లాబ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఏపీ బంద్‌ నిర్వహిస్తున్నారు. తెనాలిలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నేత అన్నాబత్తుని శివకుమార్‌, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సత్తెనపల్లి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. గుంటూరులో బస్సులను అడ్డుకున్న ఎమ్మెల్యే ముస్తఫా, మేరుగ
నాగార్జున, ఎల్‌.అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, శ్రీకృష్ణదేవరాయలు, కిలారు రోశయ్యల, రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేటలో బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. పిడుగురాళ్లలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపి నేత కాసు మహేష్‌ రెడ్డి అరెస్ట్‌ చేశారు. తాడికొండలో బంద్‌ నిర్వహిస్తున్న వైసీపి నేతలు క్రిస్టియానాతో సహా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ నేత మోపిదేవి వెంకటరమణను హౌస్‌ అరెస్టు చేసేందుకు పోలీసులు రావడంతో రేపల్లె వద్ద ఉధ్రిక్తత నెలకొంది. గోబ్యాక్‌ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. బంద్‌ సందర్భంగా హైవేపై బైఠాయించిన వైకాపా నేతలనుపోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ చీమకుర్తిలో బంద్‌కు మద్దతుగా ప్రవేటు విద్యాసంస్థలు స్వచ్చందంగా సెలవు ప్రకటించాయి. యర్రగొండపాలెం నియెజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగింది. బంద్‌ చేపట్టిన ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి ఐవి రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఖమ్మం మండలంలో కూడా బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. టీడీపీ, బీజేపీ మోసాలను నిరసిస్తూ పెనుకొండ సమన్వయ కర్త శంకర్‌ నారాయణ ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక ¬దా, విభజన చట్టం హావిూలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహాలక్ష్మి శ్రీనివాస్‌, రాగేపరశురాంలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా రసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌ రాజు ఆధ్వర్యంలో నరసాపురంలో  ధర్నా నిర్వహించారు. ఉదయం ఐదు గంటల నుండి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బస్టాండ్‌ వద్ద బైఠాయించారు. భారీగా పోలీసులు బస్టాండ్‌ వద్దకు చేరుకున్నారు. కొవ్వూరు బస్టాండ్‌ వద్ద నియోజకవర్గ కన్వీనర్‌ తానేటి వనిత ఆధ్వర్యంలో బస్సును కార్యకర్తలు అడ్డుకున్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్‌ ఎలీజా ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు సాయి బాలపద్మా, బాబ్జి, బి.వి.ఆర్‌. చౌదరి, ఆది విష్ణు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ప్రత్యేక ¬దా కోసం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. బంద్‌లో పాల్గొన్న పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీర భద్రస్వామి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు వంద మంది కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ కోట, గజపతినగరంలో వైఎస్సార్‌సీపీ బంద్‌ నేపథ్యంలో బస్సులు ఆర్టీసీ డిపోకే పరిమితమయ్యాయి. నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగింది. ఆర్టీసీ బస్సులను వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ నేత కలిమిలి రాంప్రసాద్‌ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో వెంకటగిరి, తిరుపతి రహదారిని కార్యకర్తలు దిగ్బంధించడంతో వాహనాలు పెద్ద మొత్తంలో నిలిచిపోయాయి. ఆత్మకూరులో బంద్‌ చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు కొండ వెంకటేశ్వర్లు, నోటి వినయ్‌ కుమార్‌, ప్రతాప్‌ రెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
విశాఖ జిల్లా దక్షిణ నియోజక వర్గం కన్వీనర్‌ కోలా గురువులు, జాన్‌ వెస్లీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడంతో ద్వారకా బస్‌ స్టాండ్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బంద్‌కు మద్దతుగా మద్దిలపాలెం జంక్షన్‌లో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.  వైఎస్సార్సీపీ సమన్వయ కర్తలు తైనాల విజయ్‌ కుమార్‌, వంశీ కృష్ణ, కె.కె.రాజు, వైఎస్సార్సీపీ నాయకులు చొక్కాకుల వేంకటరరావు, రామన్న పాత్రుడు, బొని శివరామ కృష్ణ, శ్రీదేవిలు ర్యాలీ లో పాల్గొన్నారు. మద్దిలపాలెం జుంక్షన్‌లో వైఎస్సార్సీపీ నాయకులు రాయుడు శ్రీను, రవి, వరలక్ష్మి, కృపాతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తూర్పు గోదావరి జిల్లా మలాపురం బస్టాండు వద్ద పి.గన్నవరం కోఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం ఆర్టీసీ డిపో ఎదుట కార్యకర్తలు, నాయకులు బైఠాయించడంతో బస్సులు నిలిచిపోయాయి. రాజోలులో కోఆర్డినేటర్‌  బొంతురాజేశ్వర్రావుతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు  చేశారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల బస్టాండ్‌ వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద బంద్‌ చేపడుతున్న వైఎస్‌ మనోహర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాయచోటిలో బంద్‌ పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి,వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కడప నగరంలోని సంధ్య కూడలి వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విద్యార్థి సంఘం నేతలు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహంతుల్లాతో పాటు మరికొంత మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీకాకుళం పలాస ఆర్టీసీ డిపో ముందు పలాస వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు ధర్నాలో పాల్గొన్నారు. టెక్కలి ఆర్టీసీ డిపో ముందు టెక్కలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ లో ప్రత్యేక ¬దా కోసం విజయవాడ లెనిన్‌ సెంటర్‌ వద్ద నినాదాలు చేస్తున్న వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధ, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ వద్దకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. బంద్‌లోభాగంగా ఆర్టీసి అవుట్‌ గేట్‌ వద్ద నిరసనలు చేపట్టారు. దీంతో బస్‌ స్డేషన్‌ వద్ద పోలీస్‌ భారీగా మోహరించారు. విద్యాధరపురం ఆర్టీసి డిపోవద్ద మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బస్సులను బయటకు రానివ్వకుండా కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. గాంధీనగర్‌లో వైఎస్సార్సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.గౌతంరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్టీసీ డిపో నుండి బస్సులు బయటకు రాకుండా వైఎస్సార్‌సీపీ ఇంచర్జి చెరుకులపాడు శ్రీదేవి ఆధ్వర్యంలో పార్టీ నేతలు శ్రీరంగడు, బజారప్ప యూత్‌ యూత్‌ నాయకులు మధు, ఇమ్రాన్‌, పార్టీ కార్యకర్తలు డిపో ఎదుట బైఠాయించారు. డోన్‌లో తెల్లవారుజామున 4 గంటలకే బంద్‌ ప్రభావం మొదలైంది. జెడ్పీటీసీ శ్రీరాములు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్‌ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నియోజకవర్గ ఇంచార్జి హఫీజ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగింది. బివై రామయ్యా, తెర్నకల్‌ సురేందర్‌ రెడ్డి, రాజా విష్ణు వర్దన్‌ రెడ్డి, రెహమాన్‌, రేణుకమ్మలు బంద్‌లో పాల్గొన్నారు. ఆదోనిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. ఆళ్లగడ్డ వైఎస్సార్సీపీ ఇంఛార్జి గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్రెడ్డి అధర్వంలో  బంద్‌ నిర్వహించారు. దీంతో ఎస్కార్ట్‌ సహాయంతో ఆర్టీసీ యాజమాన్యం బస్సులను నడిపిస్తోంది. నందికొట్కూరులో ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్యే ఐజయ్య, సిద్దార్థ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో
పోలీసుల జులుమ్‌ నశించాలని ఐజయ్య, సిద్దార్థ రెడ్డిలు రోడ్డుపై బైఠాయించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా, గౌరు వెంకటరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కర్నూలు తాలూకా పీఎస్‌ వద్ద ఉద్రిక్తతత చోటు చేసుకుంది.  వైఎస్సార్సీపీ నాయకులు బి.వై. రామయ్య అరెస్ట్‌కు నిరసనగా పీఎస్‌ ముందు వైసిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తాజావార్తలు