వైకాపా సంఘీభావ పాదయాత్ర
జగన్ సిఎం అయితేనే సమస్యలకు పరిష్కారం
మాజీమంత్రి బాలినేని
ఒంగోలు,సెప్టెంబర్27(జనంసాక్షి): వైకాపా అధినేత జగన్‌మోహన్ రెడ్డి మూడు వేల కిలో విూటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒంగోలు మండలంలోని గ్రామాల్లో గురువారం సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జగన్ సీఎం అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు
నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలు నెరవేర్చే క్రమంలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. గడిచిన నాలుగేళ్ల పాలనలో నిరుద్యోగ భృతి, రైతులకు రుణమాఫీ తదితరాల పేరుతో మభ్యపెట్టారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో తమ ప్రమేయంతోనే పూర్తి అయ్యాయని తెదేపా శ్రేణులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంత ప్రాజెక్టులకు కృష్ణాజలాలు చేరడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే అని అవినాష్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాల పనులకు ఈ నాలుగేళ్ల పాలనలో ఏమేరకు నిధులు వ్యయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా రాజకీయ ఎదుగుదలకు తోడ్పడిన ఈ ప్రాంతవాసుల రుణం తీర్చుకోవాలనే సదుద్దేశంతో అసెంబ్లీలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అడ్డుకున్నా లెక్క చేయకుండా వరద నీటిని నిల్వ చేయాలనే ఆలోచనతో ధైర్యంగా వైఎస్‌ఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వైఎస్‌ఆర్ పాలనలో రూ.కోట్లు వ్యయం చేసి 90శాతం పనులు పూర్తి చేశారన్నారు. ఇంజినీరింగ్ కళాశాలలు, ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేశారన్నారు. వైఎస్‌ఆర్ మరణం తరువాత ఒక పరిశ్రమ, విద్యా సంస్థలు, అభివృద్ధి పనులు చేశారా అని సూటిగా ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఆగిపోయిన సూక్ష్మసేద్యం నిర్మాణాలను సత్వరమే పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని హావిూ ఇచ్చారు. వైఎస్‌ఆర్ ఆశయాలను నెరవేర్చే దిశగా జగన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మోహన్, శంకర్, మల్లిఖార్జున రెడ్డి అంకయ్య తదితరులు పాల్గొన్నారు.