వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు

తిరుమలకు భారీగా చేరుకున్న భక్తులు
తిరుమల,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల కోసం తితిదే అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వేచి ఉండేందుకు తాత్కాలిక షెడ్లు నిర్మించారు. 4 నుంచి 5 కిలోవిూటర్ల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. నేటి ఏకాదశి దర్శనం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచే భక్తులను క్యూలైన్లల్లోకి అనుమతిస్తున్నారు. తిరుమలేశుడిని దర్శించుకోవాలని నిత్యం వేలాది భక్తులు పరితపిస్తూ ఉంటారు. అత్యంత పవిత్రమైన ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇందుకోసం ఇప్పటికే తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో 1.70లక్షల మందికి స్వామివారి దర్శనం కల్పించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వైకుంఠం 1,2 క్యూ కాంప్లెక్స్‌లకు అనుసంధానంగా నారాయణగిరి ఉద్యానవనంలో 16 భారీ షెడ్లను నిర్మించారు. 20 వేల మంది భక్తులు కూర్చొనే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇదే తరహాలో మరో 40వేల మంది భక్తులు వేచి ఉండేలా తిరుమాడ వీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేశారు. షెడ్లలో వేచి ఉన్న భక్తులకు తితిదే అధికారులే భోజనం, అల్పాహారం అందించనున్నారు.  బాట గంగమ్మ ఆలయం రింగ్‌రోడ్డు విూదుగా కల్యాణవేదిక వరకు కిలోవిూటర్ల మేర రెండు వరుసలతో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ అర్ధరాత్రి తర్వాత అర్చకులు ఆలయ ద్వారాలు తెరిచి శ్రీవారికి ధనుర్మాస పూజలు, ఇతర కైంకర్యాలు నిర్వహిస్తారు. అనంతరం వైకుంఠ ద్వారం తెరుస్తారు. మొదటగా ఏకాదశి పాసులు పొందిన వారికి ఈ ద్వారం గుండా అనుమతిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనం ద్వారా సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ఈ రెండు రోజుల్లో 40 గంటల సమయం సాధారణ భక్తులకే కేటాయించాలని తితిదే అధికారులు నిర్ణయించారు. ఏకాదశి ఉదయం స్వామివారి స్వర్ణ రథోత్సవం, ద్వాదశి నాడు చక్రస్నానం నిర్వహిస్తారు.