వైట్‌హౌస్‌లోకి అగంతకుడు.. శ్వేతసౌథం మూసివేత..

గత కొన్ని రోజులుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వరుసదాడులకు పాల్పడుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. ఈ దాడులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో డేగకళ్ళ పహారా ఉండే వైట్‌హౌస్‌లోకి ఓ గుర్తు తెలియని ఓ వ్యక్తి ప్రవేశించి.. భద్రతా సిబ్బందికి కంటిమీద కునుకులేకుండా చేశాడు.
ఆసమయంలో ఒబామా, తన కుటుంబంతో కలసి భవనంలోనే ఉన్నారు. అంతే, భద్రతా అధికారుల గుండెల్లో బాంబులు పేలాయి. ఒబామాను, ఆయన భార్యాబిడ్డలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వైట్ హౌస్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. గోడదూకిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, అతని పేరు జోసెఫ్ క్యాపుటో అని, గతంలో నేరాలు చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చాడని, వైట్‌హౌస్ గోడ ఎందుకు దూకాడో తెలుసుకుంటున్నామని అధికారులు తెలిపారు.