వైద్యారోగ్య శాఖకు కేంద్రం నుంచి రూ.1,692 కోట్లు

* కొత్త‌గా దంత వైద్య‌సేవ‌లు, గ్యాస్ట్రోఎంట‌రాల‌జీ సేవ‌లు

* గ‌ర్భిణిల‌కు మాత్రుస‌మ్మాన్ డ్రెస్సులు

* రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పూనం మాల‌కొండ‌య్య వెల్ల‌డి

అమరావతి,జనవరి18(జ‌నంసాక్షి): రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు కేంద్రం రూ.1692 కోట్లు విడుదల చేసింది. ఇందులో అనేక కొత్త వైద్యసేవలు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. కొత్తగా రాష్ట్రంలో 148 ఆస్పత్రుల్లో దంత వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇందుకోసం కేంద్రం రూ.12.5 కోట్లు ఇచ్చిందన్నారు. దంతాలు తొలగించడం, రూట్‌

కెనాల్‌, క్యాపింగ్‌ కూడా ఇక నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో గ్యాస్టోఎ/-రంటరాలజీ యూనిట్లు నెలకొల్పుతున్నామని, ఇందుకోసం కేంద్రం నుంచి రూ.13 కోట్లు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో ఆహారపు అలవాట్ల కారణంగా అల్సర్‌ వ్యాధి అధికంగా వస్తోంది కాబట్టి ఈ వ్యాధికి ఇక నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలందించాలనే లక్ష్యంతో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామన్నారు. వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి ఉచితంగా మెషీన్లు అందించనున్నామని, ఇందుకోసం కేంద్రం నుంచి రూ.15 కోట్లు తెచ్చామన్నారు. ఈ వినికిడి మెషీన్లను 28 ఏరియా ఆస్పత్రుల్లోనూ, 13 జిల్లా ఆస్పత్రుల్లోనూ పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 21 ఏరియా ఆస్పత్రుల్లో, 13 జిల్లా ఆస్పత్రుల్లో కంటికి సంబంధించిన చికిత్సలు చేయడం, నేత్రాలు భద్రపరచడం కోసం కొత్త పరికరాలతో కొత్త యూనిట్లు ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన ఆంబులెన్సుల ఉబరైజేషన్‌ కార్యక్రమం కోసం కేంద్రం రూ.27 కోట్లు ఇచ్చిందని పూనం మాలకొండయ్య తెలిపారు. రాష్టాన్రికి కొత్తగా 122 టెలీఆప్తమాలజీ సెంటర్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఇంతకు ముందు రాష్ట్రంలో ఉన్న 115 సెంటర్లకు ఇవి అదనం అని చెప్పారు. ఏఎన్‌ఎం లకు ట్యాబ్‌లు కొనిచ్చేందుకు కేంద్రం రూ.14 కోట్లు ఇచ్చిందని ఆమె చెప్పారు. 13 పీహెచ్‌సీలు, 60 సీహెచ్సీల్లో జాతీయస్థాయి ప్రమాణాలతో లేబర్‌రూమ్‌లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ప్రసవం సమయంలో గర్భిణిలు చీరల్లో ఉండడం వల్ల వారికి అసౌకర్యంగా ఉంటుందని, ఆ అసౌకర్యాన్ని పోగొట్టి మాత్రుసమ్మాన్‌ డ్రెస్సులు అందజేస్తామని, దీంతో ఆ సమయంలో వారికి గౌరవప్రదంగా , సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించి నిధులు ఇచ్చిందని తెలిపారు.