వైద్యులు వృత్తికి న్యాయం చేయాలి

వైద్యపరికరాలు లేవన్న సాకుతో సేవలు ఆపరాదు
ఆధునీకరించిన ఇఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభించిన హరీష్‌ రావ

సంగారెడ్డి,ఆగస్ట్‌3(జనం సాక్షి): పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిం
చొద్దని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. వైద్య పరికరాలు లేవనే సాకుతో పనిచేయకపోవడం మంచిది కాదన్నారు. వృత్తికి న్యాయం చేయాలని వైద్యులను కోరారు. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో రూ.20 కోట్లతో ఆధునీకరించిన ఈఎస్‌ఐ దవాఖానను మంత్రి మంత్రి మల్లారెడ్డితో కలిసి హరీశ్‌ రావు ప్రారంభించారు. పఠాన్‌చెరు ప్రాంతంలోని కార్మికులకు ఈఎస్‌ఐ దవాఖానాలో అన్నిరకాల వైద్య సదుపాయాలు కల్పించడం సంతోషంగా ఉన్నారు. అనంతరం దవాఖానను పరిశీలించారు.అయితే ఇఎస్‌ఐ దవాఖాన పనితీరుపై మంత్రి హరీశ్‌ రావు అసహనం వ్యక్తం చేశారు. దవాఖాన వివరాలు ఇవ్వకపోవడంతో సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. నలుగురు వైద్యులు నాలుగేండ్లుగా విధులకు రావడంలేదని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అదేవిధంగా హాస్పిటల్‌లో ప్రసవాలు ఎందుకు చేయడం లేదని సూపరింటెండెంట్‌ను నిలదీశారు. జూలై నెలలో మూడు డెలివరీలు మాత్రమే చేయడంపై సీరియస్‌ అయ్యారు. ఇక్కడ పనిలేకుండే పటాన్‌చెరు దవాఖానలో డ్యూటీ చేయాలని ఆదేశించారు. హాస్పిటల్‌లో డాక్టర్లు ఫుల్‌గా ఉన్నప్పటికీ పేషెంట్లు నిల్‌ అని చెప్పారు. వైద్యపరికరాలు లేవనే సాకుతో డాక్టర్లు పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ చొరవతో రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్‌ఐ హాస్పిటళ్లను పటిష్ఠం చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అందరికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రామచంద్రపురం ఈఎస్‌ఐ దవాఖానలో ఆధునీకరణ పనులు పూర్తవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే పటాన్‌చెరులో 30 పడకల ఈఎస్‌ఐ దవాఖాన నిర్మిస్తామన్నారు.

తాజావార్తలు