వైసిపిలో కార్పోరేషన్‌ చిచ్చు

ఆరో డివిజన్‌ అభ్యర్థి ఎంపికపై వ్యతిరేకత
గుంటూరు,నవంబర్‌6 (జనంసాక్షి) : వైసీపీలో కార్పొరేషన్‌ ఎన్నికలు చిచ్చు రేపాయి. 6వ డివిజన్‌కు వైసీపీ అభ్యర్థి ఎంపికపై పార్టీలో వ్యతిరేకత నెలకొంది. ఆ డివిజన్‌ వైసీపీ అభ్యర్థిగా ఆత్మకూరి నాగేశ్వరరావు నామినేషన్‌ దాఖలు చేశారు. తూర్పు నియోజక వర్గంలో ఉన్న ఈ డివిజన్‌లో స్థానికేతరుడికి టిక్కెట్‌ కేటాయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి టిక్కెట్‌ అమ్ముకున్నాడని కరపత్రాలు పంచుతున్నారు. వైసీపీ పార్లమెంట్‌ జాయింట్‌ సెక్రటరీ గుజ్జల రామకృష్ణారెడ్డి పేరుతో ఈ కరపత్రాలు ముద్రించారు. మానసిక ఒత్తిడికి గురిచేసి పాదర్తి రమేష్‌ గాంధీ మరణానికి కారణమయ్యారని ఆరోపణలు గుప్పించారు. మేయర్‌ పదవి కోసం గాంధీ నుంచి ఎమ్మెల్యే గిరి రూ. 4 కోట్లు వసూలు చేశారని ఆ కరపత్రాల్లో విమర్శించారు. గాంధీ కుటుంబ సభ్యులకు కాకుండా పల్నాడు ప్రాంత వ్యక్తికి టిక్కెట్‌ అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. మద్దాలి గిరికి దమ్ముంటే ఈటల రాజేందర్‌ల రాజీనామా చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఇప్పుడు ఈ అంశం గుంటూరులో హాట్‌ టాపిక్‌గా మారింది.