వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా

– తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లడానికి ఆంక్షలు పెట్టారు
– ఎక్కడికెళ్లినా పర్మిషన్‌ తీసుకోవాలన్నారు
– తండ్రిలేనివాడివన్న జాలితో ఉండనిచ్చానంటూ జగనే అన్నాడు
– వదిలేస్తే గాలికిపోతావని హెచ్చరించాడు
– పార్టీలో తమ్ముడికి ఇచ్చే గౌరవం ఇదేనా?
– వంగవీటి రంగా అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు
– ఆంక్షలు లేకుండా ప్రజాజీవితంలో కొనసాగాలనుకుంటున్నా
– రంగా ఆశయాన్ని ఎవరు నెరవేరిస్తే వాళ్లను నెత్తిని పెట్టుకుంటాం
– విలేకరుల సమావేశంలో వంగవీటి రాధాకృష్ణ
– తెదేపాలో చేరికపై క్లారిటీ ఇవ్వని రాధా
విజయవాడ, జనవరి24(జ‌నంసాక్షి) : నాలుగేళ్ల పాటు వైసీపీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, చివరికి తన తండ్రి వంగవీటి రంగ విగ్రహావిష్కరణకు వెళ్లడానికి వీళ్ల పర్మిషన్‌ తీసుకోవాలని ఆంక్షలు పెట్టారని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. తన తండ్రి ఆశయాల కోసం ఇన్నాళ్లు అవమానాలు భరించి పార్టీలోకి కొనసాగానన్నారు. ఇక అవమానాలు భరించలేక చివరిగా పార్టీని వీడాల్సి రావటం జరిగిందని రంగా స్పష్టం చేశారు. గురువారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  తాను వైసీపీలో చేరే సమయంలో జగన్‌ తనను సొంత తమ్ముడిలా చూసుకుంటానని చెప్పారని, పార్టీలో తమ్ముడికి ఇచ్చే గౌరవం ఇదా అంటూ ప్రశ్నించారు. వైసీపీలో తనకుకు జరిగిన అవమానాలు ఎవరికీ జరగకూడదని రాధా అన్నారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లాలంటే తాను పర్మిషన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజా జీవితంలో కొనసాగాలనకుంటున్నానని చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసిన రోజు నుంచి సోషల్‌ విూడియాలో వైసీపీవాళ్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారని వంగవీటి రాధా మండిపడ్డారు. చంపేస్తాం, అంతు తేలుస్తామని బెదిరిస్తున్నారన్నారు. వారి సంతృప్తి కోసం తనను చంపాలనుకుంటే చంపేయొచ్చని రాధా పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఏం చేయగలగుతాడని వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై వంగవీటి మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే దేనికి పనికిరాడని ఆయన ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వలేని పార్టీలో ఎలా ఉండాలని ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 11 నుంచి వైసీపీలో తనను అవమానించి పక్కన పడేశారని.. అయినా తాను అభిమానంతో పార్టీలో ఉంటే.. వారు మాత్రం జాలి చూపించారన్నారు. సూటి పోటి మాటలతో బాధించారని.. రంగా ప్రజల్లో అభిమానం లేదని ప్రచారం చేశారన్నారు. రంగా విగ్రహ ఆవిష్కరణకు ఎవరి అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారని గుర్తు చేశారు. తనపై సోషల్‌ విూడియాలో చేస్తున్న దాడులకు భయపడే రకం కాదని రాధా స్పష్టం చేశారు. తనను బెదిరిస్తున్నవారి ఐపీ అడ్రస్‌ ద్వారా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగలనని, కానీ వైసీపీ నేతలు కింద వారిని బలి చేస్తారనే ఆగిపోయానని చెప్పారు. జగన్‌లా ఏపీ పోలీసులపై నమ్మకం లేదని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసే రకం కాదని.. ఏపీ పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. జగన్‌ పద్దతి మార్చుకోని రంగా అభిమానుల్ని గౌరవిస్తే బావుంటుందన్నారు.
తెదేపాలో చేరికపై క్లారిటీ ఇవ్వని రాధా..
ఏ పార్టీలో చేరబోతున్నారని విూడియా ప్రశ్నించినా రాధా సమాధానం ఇవ్వలేదు. తన తండ్రి
ఆశయం కోసమే పోరాటం చేస్తున్నానని చెప్పారు. తన తండ్రిని అన్నిపార్టీల వారు అభిమానిస్తారని.. ఆయన విగ్రహ ఆవిష్కరణకు అన్ని పార్టీల నేతలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కొంతమంది తాను డబ్బు తీసుకొని పార్టీ మారబోతున్నానని చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. తన తండ్రి పేరును ఎప్పుడూ చెడగొట్టనన్నారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించి కొందరు వ్యక్తులు చేసిన పనిని.. ఏదో ఒక పార్టీకి పూయడం మంచిది కాదని రాధా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తనను పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. రాధా అనే వ్యక్తికి పదవులు ముఖ్యం కాదని, ప్రజలకు సేవచేయడం, రంగా ఆశయం కోసం పని చేయడమే లక్ష్యమన్నారు. అందుకే విజయవాడలో పేదలకు పట్టాలు ఇవ్వమని చంద్రబాబును కోరుతున్నానని.. పెద్దమనిషిగా తన కోరికను మన్నిస్తారని భావిస్తున్నానని రాధా చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కొన్ని లోపాలున్నాయని, వాటిని సవరించాలని విజ్ఞప్తి చేశారు. రంగా ఆశయాన్ని ఎవరు నెరవేరిస్తే వాళ్లను నెత్తిని పెట్టుకుని చూస్తామని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు.