వైసీపీ అధికారంలోకొస్తేనే..  ‘ఆరోగ్యశ్రీ’ బాగుపడుతుంది


– పథకాన్ని చంద్రబాబు సర్కార్‌ నిర్వీర్యం చేసింది
– రూ.500 కోట్ల బకాయిలు ఎందుకు చెల్లించరు?
– వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి
అమరావతి, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : ఏపీలో వైసీపీ అధినేత జగన్‌ అధికారంలోకొస్తేనే ఆరోగ్యశ్రీ బాగుపడుతుందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు సర్కార్‌ నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి 35లక్షల కుటుంబాలకు మంచిచేసే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని, పేద ప్రజలపై బాబు సర్కార్‌ వివక్ష చూపుతోందని విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చలువ వల్లే పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిందని అన్నారు. ‘ఆరోగ్య శ్రీ’ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ పథకం సేవలు నిలిచిపోయాయని అన్నారు. రూ.500 కోట్ల బకాయిలు చెల్లించడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చినబాబుకు కవిూషన్లు రావడం లేదనా.. లేక దాని వల్ల కవిూషన్లు లేవనా అని ప్రశ్నించారు. బుధవారం లోగా ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పేదల తరపున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ధర్మపోరాట దీక్షకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని, చంద్రబాబు పర్యటనలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, కానీ, పేదల వైద్యానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ప్రతీ పేదవాడికి ఉచిత వైద్యం అందాలంటే అది వైసీపీతోనే సాధ్యమవుతుందని,
వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ తో పాటు పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా, ప్రజా వ్యతిరేఖ పాలన సాగిస్తున్న తెదేపాకు గుణపాఠం చెప్పి ప్రజల పక్షాన నిలిచే వైసీపీకి పట్టం కట్టాలని శ్రీకాంత్‌రెడ్డి ప్రజలను కోరారు.