‘వ్యక్తిగత ఆరోపణలు తగవు’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : ప్రజాధారణ చూడలేక, రాజకీయంగా ఎదగలేక టిఆర్‌ఎస్‌ నాయకులు తెలుగుదేశం పార్టీపై, తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని ఆదిలాబాద్‌ ఎంపి రమేష్‌ రాథోడ్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరిట ఇంత కాలం ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. కేసిఆర్‌తో పాటు జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులు తమ కుటుంబంపై వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం ఎవరూ పోరాడుతున్నారు అనే విషయం ప్రజలందరికీ తెలుసునని, పార్లమెంట్‌లో తమ వంతుగా తెలంగాణ వాదాన్ని వినిపించామని తమ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం పాటుపడుతూ రాజకీయంగా ఎదగాలే తప్ప, వ్యక్తిగత  దుషణలకు పాల్పడితే ప్రజలు గుర్తించరన్న విషయాన్ని టిఆర్‌ఎస్‌ నాయకులు తెలుసుకోవాలని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం, జిల్లా అభివృద్ధికి శాఖ శక్తుల కృషి చేస్తామని అన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని భవిష్యత్తులో పార్టీకి ప్రజలు పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.