శాపంగా మారిన ప్రకృతి
ఆదిలాబాద్, అక్టోబర్ 9 జిల్లా రైతులకు ప్రకృతి శాపంగా మారింది. ప్రతి ఏడాది ఏదో సమస్య రైతులను పీడిస్తూనే ఉంది. వాతావరణంలో ప్రతి కూల పరిస్థితుల ప్రభావం కారణంగా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధిక వర్షాలతో ఈ ఖరీఫ్‌లో పంటల దిగుబడులపై తీవ్రంగా ఉంది. చేసిన అప్పులు తీర్చలేక రైతులు మనోవేదనకు గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత మూడు వారాలలో జిల్లావ్యాప్తంగా 15మంది రైతులు మరణించడం రైతులకు తీవ్ర కలవరం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 6.50 లక్షల హెక్టర్లలో వివిధ పంటలు సాగవుతుండగా అందులో సుమారు 4 లక్షల హెక్టర్ల వరకు పత్తి సాగు అవుతుంది. తెల్ల బంగారంగా పేరొందిన పత్తిని నమ్ముకుని జిల్లాలో మెజార్టీ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఖరీప్ ప్రారంభం నుండి రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.ప్రారంభంలో వర్షాలు లేక పంటసాగులో ఆలస్యమైన మెరుగైన వర్షాలు కురియడంతో రైతులు ఊపిరి పిల్చుకున్నారు. వర్షాలు సక్రమంగా కురియడంతో ఈ ఖరీఫ్‌లో తమ కష్టాలు గట్టెక్కుతాయని ఆనందించిన రైతులకు అధిక వర్షాలు కురియడంతో ఆ సంతోషం నిలవలేకపోయింది. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఎవురులు, పురుగుల మందులు వేయడంతో పెట్టుబడులు పెరిగిపోయాయి. చేతికి పంటలు వస్తుయన్న తరుణంలో వర్షాలు అధికంగా కురియడంతో పంటలు దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులు రాక అప్పులు ఎలా తీర్చాలో తెలియక గుండెనిబ్బరాన్ని కోల్పోయిన రైతులు చావే పరిష్కారంగా భావించి వరుసుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.