శివరాత్రికి కోటప్పకొండలో భారీగా ఏర్పాట్లు

 ప్రత్యేకంగా ప్రభల ఊరేగింపు కార్యక్రమం
గుంటూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  మహాశివరాత్రి పర్వదినాన కోటప్ప కొండలో శుక్రవారం తిరునాళ్ళ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు ప్రత్యేక పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు.
కోటప్పకొండలో మహాశివరాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. కోటప్పకొండ ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత వాసులు ఎంతో సంబరంగా జరుపుకునే ప్రభల పండుగ కూడా ఇదే. కొండ దిగువున తిరునాళ్ల తెల్లవార్లూ సాగుతుంది. విద్యుత్‌ కాంతులతో శోభిల్లే భారీ ప్రభలు కొండకు తరలి రానున్నాయి.  పరిసర ప్రాంతాల నుంచి సాధారణ ప్రభలు అధిక సంఖ్యలో తరలి వచ్చి కొండ దిగువున కొలువుదీర నున్నాయి. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు.  కోటప్పకొండ తిరునాళ్ల మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే జరిగే వేడుక. దీనికి లక్షలాది మంది తరలివస్తారు. ప్రభలు తిరునాళ్ల వైభవాన్ని చాటుతాయి. వీటి నిర్మాణం కోసం నిర్వాహకులు లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. జాతరకు ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. శ్రీ మేథాదక్షిణామూర్తి అవతార రూపమైన శ్రీ త్రికోటేశ్వర స్వామి మహాపుణ్యక్షేత్రం కోటప్పకొండ. మహాశివరాత్రికి ఇక్కడ జరిగే తిరునాళ్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి. కొలిచిన ప్రజలకు కొంగుబంగారంగా నిలుస్తూ స్వామి వారు భక్తులకు కనువిందు చేస్తున్నాడు. కోటప్పకొండ తిరునాళ్లకు ప్రత్యేకత ఉంది. నిర్మలత్వం, ప్రశాంతత మూర్తీభవించిన ఓంకార స్వరూపుడు శ్రీ దక్షిణామూర్తి. దక్షిణాధి ముఖంగా ఆశీనుడైన మూర్తి కనుక ఈ పేరు సార్థకమైంది. త్రికోటేశ్వరుడు బ్రహ్మచారి. అందువల్ల ఇక్కడ వివాహాలు ఉండవు. దేవస్థానంలో ధ్వజస్తంభం కూడా ఉండదు. ధనుర్మాసంలో ఆరుద్రోత్సవం ఇక్కడ నిర్వహిస్తారు. తిరునాళ్లకు లక్షలాదిగా ప్రజానీకం తరలివస్తారు. విద్యుత్తు ప్రభలు, బొమ్మల కొలువులు, రంగుల రాట్నాలు, జైంట్‌వీల్‌, ప్రభుత్వ పథకాల స్టాళ్లు, పోలీసుల గుడారాలు ఇక్కడ అన్నీ ప్రత్యేకంగానే
ఉంటాయి.తిరునాళ్ల సందర్భంగా కొండకు వస్తున్న భక్తుల కోసం లడ్డూలు, అరిసెలు తయారు
చేస్తున్నారు. దేవాదాయ శాఖ తరపున అనేక దేవస్థానాల నుంచి ప్రత్యేక సిబ్బంది, ఉద్యోగులు తిరునాళ్ల పురస్కరించుకుని విధులు నిర్వహిస్తారు.  తిరునాళ్లకు వచ్చిన ప్రజలకు అన్నం అందుబాటు లో లేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు వండి వడ్డిస్తుంటారు.