శివాజితో డ్రామాలాడించేది టీడీపీ నేతలే

– నోటీసులొస్తాయని శివాజికి ముందే ఎలా తెలుసు?
– నోటీసులతో సానుభూతికోసం ప్రయత్నిస్తున్నారు
– బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు
అమరావతి, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : సినీ నటుడు శివాజితో డ్రామాలాడించేది టీడీపీ నేతలేనని, తెలంగాణ
ఎన్నికల్లో లబ్ది పొందేందుకే టీడీపీ పార్టీ నోటీసుల డ్రామా ఆడుతోందని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఆరోపించారు. సోమవారం విూడియాతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు. ఐదు వందలతో పోయే కేసును పట్టుకొని ఎదో జరిగిపోయినట్లు టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, ఇటువంటి ప్రచారం వలన ఎటువంటి సానుభూతి రాదని పేర్కొన్నారు. ఇదివరకు నోటీసులు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో అందుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అదే నోటీసులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డికి వస్తే మాత్రం కోర్టులపై గౌరవం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడేవారని ఎద్దేవ చేశారన్నారు. చంద్రబాబుకు కోర్టు నుంచి నోటీసులు వస్తే ప్రధాని నరేంద్ర మోదీ చేయించారనడం హాస్యాస్పదమన్నారు. హీరో శివాజీతో డ్రామా ఆడించింది టీడీపీ నాయకులేనని, ఈ డ్రామాలు ప్రజలకు తెలియదనుకోవడం వారి మూర్ఖత్వమని మండిపడ్డారు. అరెస్టు వారెంట్‌ విషయం వారం రోజుల ముందు శివాజీకి ఎలా తెలుసని ప్రశ్నించారు. టీడీపీ ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలను నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని వివరించారు. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదని విష్ణుకుమార్‌ రాజు ఎద్దేవ చేశారు.

తాజావార్తలు