శైవాలయాల్లో కార్తీక సందడి

సముద్ర,నదీతీరాల్లో పుణ్యస్నానాలు
ప్రత్యేకపూజలు,అభిషేకాలు  చేసిన భక్తులు
పంచారామక్షేత్రాల్లో మార్మోగిన శివనామం
అమరావతి,నవంబర్‌30 (జనం సాక్షి):  కార్తీక పౌర్ణమితో కూడిన సోమవారం రావడంతో శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది.  పలు సముద్ర తీరాల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శైవాలయాలతో పాటు వైష్ణవాలయాలకు భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.మరోవైపు అన్ని శివాలయాల్లో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారు. మాస్క్‌ ధరించడం, సామాజికదూరం పాటించేలా? ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మహిళలు వత్తులు వెలగించి, ఉసిరిచెట్లకు పూజలు చేసారు. కార్తీక సోమవారం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శైవాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తెల్లవారు
జాము నుంచే శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. భారీగా క్యూలైన్లలో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శ్రీకాహస్తీశ్వరాలయంలో కార్తీకంతో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. ముక్కంటిని దర్శనం కోసం భక్తజనం అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంభికా సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సోమవారం శ్రీశైలం పుణ్యక్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచే భారీగా తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలవడానికి బారులు తీరారు. అంతేకాకుండా శ్రీశైలం ఆలయ పురవీధుల్లో నుంచి గంగాధర మండపం, నంది మండపం వరకు భక్తులు కార్తీక దీపారాధ నలు చేస్తూన్నారు. వేకువజామునుంచే పాతాళగంగలో స్నానమాచరించి ఆలయంలో దర్శనాలకు క్యూ కట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో కార్తీకపౌర్ణమి సోమవారం సందర్భంగా సత్యదేవుని సన్నిధికి భక్తులు  పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే సత్యదేవుని వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభమయ్యాయి. వ్రత మండపాల క్యూలైన్ల వద్ద భక్తులు బారులు తీరారు. ఆలయ అధికారులు కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. పంచరామక్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు క్షీరరామ లింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 4గంటలకే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పవిత్ర స్నానాలు చేసిన మహిళలు శివాలయంలో పెద్ద ఎత్తున్న వత్తులు వెలిగించే కార్యక్రమం చేశారు. పలుచోట్ల గోమాతలకు పూజలు చేశారు. భక్తులు శివాలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక ఆరాధనలు చేశారు. ప్రజలు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం,మహానంది, పంచారామాలు, కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గ, శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు  పోటెత్తారు.  పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పరమశివుడిని ప్రార్థించారు.  అమరావతి, కోటప్పకొండ, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడలో కృష్ణాతీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా ప్రాచీన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.