శ్రీకాళహస్తిలో పవిత్రోత్సవాలు

20న అంకురార్పణతో ప్రారంభం

శ్రీకాళహస్తి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ): శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల 20 నుంచి అయిదు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో ఏటా నిర్వహించే ఈ విశేషోత్సవాలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పంచమూర్తుల దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఇక్కడి వాయులింగేశ్వరాలయంలో శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామితో పాటు పరివార దేవతామూర్తులకు అర్పించే నివేదన, ధూప, దీప, కైంకర్యాల్లో ఎలాంటి లోపాలు జరిగినా, తెలిసి, తెలియక జరిగిన తప్పులను క్షమించమని కోరుతూ.. దేవదేవుని ఆరాధించే విశేషోత్సవాలే.. ఈ పవిత్రోత్సవాలు. 20న ఉత్సవాల అంకురార్పణలో భాగంగా శ్రీ(సాలీడు), కాళ (పాము), హస్తి (ఏనుగు)లతో పాటు భరద్వాజమహర్షికి సంకల్ప పూర్వక అభిషేకాలు, విశేష పూజలు, నిర్వహించి పట్టణ పురవీధుల్లో ఊరేగించనున్నారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో అయిదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో వ్రతచరి, ఉపచార పూజలు నిర్వహించనున్నారు. ఈ అయిదు రోజుల్లో శ్రీవరసిద్ధి వినాయకస్వామి, శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబిక అమ్మవార్లకు పవిత్రమాలలు సమర్పించి విశేష పూజాది కార్యక్రమాలు జరపనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 23వ తేదీ రాత్రి ఆలయంలోని అమ్మవారి గర్భాలయానికి ఎదురుగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక ఊంజల్‌సేవ మ¬త్సవం, 24న రాత్రి పంచమూర్తులను పురవీధుల్లో ఊరేగించనున్నారు.

తాజావార్తలు