శ్రీలంక రాయబారిపై దాడి
ఓ దేశ రాయబారిపై ఒక వర్గానికి చెందిన గ్రూప్ దాడి చేసింది. మలేసియాలోని కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక రాయబారి ఇబ్రహిం సాహిబ్ ఎయిర్‌పోర్టులో నడుచుకుంటూ వెళ్తుండగా… ఆయనపై అకస్మాత్తుగా ఓ గ్రూప్ అడ్డుకుని పిడిగుద్దులు గుద్దారు. ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు ఆ గుంపును చెదరగొట్టి.. ఆ రాయబారిని కాపాడగలిగారు.
ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఒకటి బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. ఈ దాడిలో ఇబ్రహిం స్వల్పంగా గాయాలయ్యాయి. దాడి చేసినట్లు భావిస్తున్న ఆ ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఈ ఘటనపై శ్రీలంక విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశ అధికారులకు రక్షణ కల్పించడంలో మలేసియా అధికారులు విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేసింది లంక. దీనిపై వెంటనే విచారణ జరిపించి.. తమ దౌత్యబృందానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. ఆ రాయబారిపై ఏ వర్గం దాడికి పాల్పడిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.