శ్రీవారిని దర్శించుకున్న రతన్‌టాటా
బాబుతో కలసి ఆస్పత్రికి శంకుస్థాపన
తిరుపతి,ఆగస్ట్31(జనం సాక్షి): తిరుమల శ్రీవారిని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, ఎపీ ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు. ఉదయం నిజపాదసేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు రతన్ టాటాకు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేసి రతన్ టాటాను పట్టువస్త్రంతో సత్కరించారు. తదనంతరం టీటీడీ కేటాయించిన భూమిలో టాటా ట్రస్ట్ సహకారంతో రాష్ట్రప్రభుత్వం నిర్మిచబోతున్న క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమానికి తిరుపతికి పయనం అయ్యారు. తిరుపతిలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా టాటా ట్రస్టు చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో కలిసి చంద్రబాబు శ్రీ వేంకటేశ్వర క్యాన్సర్ వైద్య విజ్ఞాన సంస్థ నిర్మాణానికి భూమి పూజ చేశారు. టాటా ట్రస్టు యాజమాన్యం మాట్లాడుతూ…శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల సవిూపంలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. టిటిడికి కేటాయించిన 25 ఎకరాల స్థలంలో వెయ్యి కోట్ల రూపాయలతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రి మొత్తం వెయ్యి పడకలకు సంబంధించి మొదటి విడతలో 350 పడకలతో నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రతన్‌టాటా, టిడిపి ఎంపిలు పాల్గొన్నారు.