శ్రీవారి ఆభరణాల్లో అవకతవకలు జరగలేదు
– ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
అమరావతి, సెప్టెంబర్19(జనంసాక్షి) : తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో ఎలాంటి అవకతవకలూ జరగలేదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఆభరణాలపై టీటీడీ క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహిస్తోందని చెప్పారు. శ్రీవారి ఆభరణాలకు సంబంధించి బ్రిటీష్ కాలంలో లెక్కలు అందుబాటులో లేవని.. మహంతుల నుంచి టీటీడీ బోర్డుకు పరిపాలన బదిలీ అయ్యే సమయానికి ఉన్న ఆభరణాలన్నీ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని జస్టిస్ వాద్వా కమిటీ, జస్టిస్ జగన్నాథరావు కమిటీ నిర్ధారించాయని చెప్పారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో భాజపా సభ్యుడు మాధవ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై ఆరోపణలు వస్తున్నందున సిట్టింగ్ జడ్డితో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ పాత కమిటీ రిపోర్టులను సభ్యులకు అందజేస్తామన్నారు.