శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
మరో నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టం
శ్రీశైలం,జూలై26(జనంసాక్షి): శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు కొనసాగుతోంది. పూర్తిస్తాయి నీటిమట్టానికి చేరువువతోంది. ఎగువన వర్షాలకు నీరు రావడంతో ప్రాజెక్టులను నిండుకుండల్లా మార్చింది. కర్ణాటకలో ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు నిండిపోగా.. తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టులు కూడా ఒక్కొక్కటిగా నిండుతున్నాయి. కృష్ణా బేసిన్ లోని అల్మట్టి, నారాయణపూర్, జూరాల వరకు వరద పోటెత్తుతోంది. అటు తుంగభద్రకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణమ్మ ఉరకలెత్తి ప్రవహిస్తుండడంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు.కేవలం 5 రోజుల్లో 88 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దాంతో జులై నెలలోనే వరదనీటితో శ్రీశైలం ప్రాజెక్ట్ కళకళలాడుతోంది. వరద ఇంకా కొనసాగే అవకాశాలు ఉండటంతో.. ఈ నెలలోనే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండిపోయే అవకాశముంది. జులై నెలలోనే ఈ స్థాయి వరదలు రావడం.. గత నాలుగేళ్లలో ఇదే ప్రథమం. గతేడాది ఇదే సమయానికి 20 టీఎంసీల నీరు వచ్చి చేరగా.. ఇప్పుడు 88 టీఎంసీల వరకు వరద రావడం విశేషం. నిరుడు జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెల వరకు నామమాత్రపు వరద మాత్రమే రాగా.. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నెల రోజుల్లోనే 418 టీఎంసీల నీరు వచ్చి చేరింది. శ్రీశైలం జలాశయానికి గత పదకొండేళ్లలో వచ్చిన ఇన్ ప్లోలను పరిశీలిస్తే.. 2007-08 లో భారీ వరదలు రావడంతో.. కృష్ణమ్మ పరుగులు పెట్టింది. జులై మొదటి నుంచే పెద్ద ఎత్తున ఇన్ ప్లోలు రావడంతో నెల రోజుల్లోనే 409 టీఎంసీల నీళ్లు చేరాయి. 2009-10 జులై రెండో భాగంలో 80
టీఎంసీలు, 2011-12లో 89 టీఎంసీలు, 2013- 14 లో 219 టీఎంసీల భారీ ఇన్ ప్లో వచ్చింది. గత నాలుగేండ్లలో జూలైలో 2016-17లో శ్రీశైలం ప్రాజెక్ట్ కు 21 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఈసారి మరో ఐదు రోజులు మిగిలి ఉండగానే.. 51 టీఎంసీల నీరు వచ్చి చేరింది.