శ్వేత పత్రాలు చదివితే ఆశ్చర్యమేస్తోంది

– చేయని పనులను చేసినట్లు చూపుతున్నారు
– మెక్‌ టెక్‌ జోన్‌ పై ప్రత్యేక శ్వేత పత్రం విడుదల చేయాలి
– వైద్య పరికరాల కొనుగోళ్లలో లక్షల అవినీతి జరిగింది
– మూడువేల ఖరీదు చేసే పరికరానికి ముప్పై వేలు బిల్లు పెట్టడం దుర్మార్గం
– విలేకరుల సమావేశంలో జనసేన నేత రావెల కిషోర్‌బాబు
అమరావతి, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేత పత్రాలు చదివితే ఆశ్చర్యం కలుగుతుందని జనసేన నేత రావెల కిషోర్‌ బాబు అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. అన్నీ చేశామని, అభివృద్ధి జరిగిందంటూ అభూత కల్పనలను వివరిస్తున్నారని మండిపడ్డారు. ఈ శ్వేత పత్రాలలో చేయని పనులు చేసినట్లుగా, చేసిన తప్పులను ఒప్పులుగా చూపించుకుంటున్నారన్నారు. మెడికల్‌ కు సంబంధించి, ఎంఎంఆర్‌, ఐఎంఆర్‌ ల రేట్ల విషయంలో అన్నీ అబద్దాలే చెప్పారని రావెల పేర్కొన్నారు. వైద్య సదుపాయాలు, సౌకర్యాలు కేవలం ధనికులు, పట్టణ ప్రాంత వాసులకే పరిమితమయ్యాయన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఏమాత్రం వైద్య సదుపాయాలు అందడం లేదన్నారు. శ్వేత పత్రాలతో ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప.. క్షేత్ర స్థాయిలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వాసుపత్రులలో సిబ్బంది, వైద్యుల కొరత ఉన్నా.. ఇంతవరకు భర్తీ చేయలేదన్నారు. ఎన్నో కొత్త పథకాలు పెట్టామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, మెడికల్‌ డైరెక్టర్‌ పోస్ట్‌ లో ఇంతవరకు నియమించ లేదన్నారు. గతంలో చేసిన వారంతా ఒత్తిడిని తట్టులోలేక వదిలేశారన్నారు. పూనం మాలకొండయ్య వేధింపులు భరించలేక ఆ పోస్ట్‌ లోకి ఎవరూ రావడం లేదన్నారు. మెక్‌ టెక్‌ జోన్‌ లో పది మెడికల్‌ సంస్థలు వచ్చినట్లు ప్రకటించినా? అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మెక్‌ టెక్‌ జోన్‌ పై ప్రత్యేక శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వైద్య పరికరాల కొనుగోళ్లలో కూడా లక్షల రూపాయల అవినీతి జరిగిందని, మూడు వేల రూపాయలు ఖరీదు చేసే పరికరానికి ముప్పై వేలు బిల్లు పెట్టడం దుర్మార్గమని, వాటిని సరఫరా చేసే సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టి అరెస్టు చేయాలని రావెల కోరారు.