షాట్‌వాల్‌ విధానంతో అధిక బొగ్గు ఉత్పత్తి

వ్యవయం కూడా తగ్గుతుందన్న అధికారులు

జయశంకర్‌ భూపాల్‌పల్లి, ఫిబ్రవరి7 (జ‌నంసాక్షి): భూగర్భ గనిలో అధిక లోతులో ఉన్న బొగ్గును వెలికి తీసేందుకు షాట్‌వాల్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. నిర్ధేశిత లక్ష్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటిని అధిగమించేందుకు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించ నున్నట్లు వెల్లడించారు. సింగరేణిలో శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కెన్యూటెక్‌ గనిలో ప్రస్తుతం ఈ విధానంతో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు. బొగ్గు అవసరాలు పెరిగిపోతుంది. అందుకు కావాల్సిన సరకును తీసేందుకు నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. 8వ గనిలో దీనిని అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలని చూస్తున్నామని చెప్పారు. షాట్‌వాల్‌ విధానంలో గనిలో 340 విూటర్ల లోతులో ఉన్న బొగ్గును కూడా వెలికితీయవచ్చు. ఎలాంటి పేలుళ్లు అవసరం లేదు. షాట్‌వాల్‌ యంత్రం 120 విూటర్ల పొడవు ఉంటుంది. దీనితో పాటు రోడ్డు హెడ్డర్‌ అనే మరో యంత్రం ఉంటుంది. ఇది ప్రతి రోజు

గనిలో 16 విూటర్ల మేర సొరంగం చేసుకొంటూ వెళ్తుంది. ఆ తర్వాత షాట్‌వాల్‌ యంత్రం లోనికి పోతుంది. దీనికి ఉండే మరపళ్లతో 2 విూటర్ల వెడల్పుతో బొగ్గును కోస్తూ ముందుకు సాగుతుంది. కోసిన బొగ్గు పక్కన ఉండే కన్వేయర్‌ బెల్ట్‌పై పడుతుంది. తర్వాత భూఉపరితలానికి వస్తుంది. ఈ విధంగా గంటకు 1750 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయవచ్చు. దీనికి అనుసంధానంగా హైడ్రాలిక్‌ యంత్రం కూడా ఉంటుంది. 580 టన్నుల పైకప్పు బరువును నిరోధించేలా పనిచేస్తుంది. దీంతో పైకప్ప కూలే అవకాశం ఉండదు. గనిలో జరిగే ఉత్పత్తి విధానాన్ని కంప్యూటర్‌లో పర్యవేక్షిస్తారు. ఈ పరిజ్ఞానం అమెరికా, దక్షిణాఫ్రికా, చైనా దేశాల్లోని గనుల్లో ఉంది. అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించి అధికోత్పత్తి సాధించాలనే లక్ష్యంతో సింగరేణి ముందడుగు వేస్తోంది. బొగ్గు అవసరాలపై దృష్టి సారిస్తూ ఉత్పత్తిని పెంచుకొంటూ.. నిర్ధేశిత లక్ష్యాలను అధిగమించేందుకు నడుం బిగిస్తోంది. విదేశీ పరిజ్ఞానమైన షాట్‌వాల్‌ విధానాన్ని భూగర్భ గనుల్లో అమలు చేయడానికి నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ గనిలో ప్రవేశపెట్టడానికి ప్రణాళిక రూపొందించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ బొగ్గు తీయవచ్చనే ఆలోచన చేసింది యాజమాన్యం. భూగర్భ గనుల్లో మానవ శక్తి, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పిత్తి చేపట్టినా సంస్థకు నష్టాలే వస్తున్నాయి. కంటిన్యూస్‌మైనర్‌, బ్లాస్టింగ్‌ గ్యాలరీ విధానాల్లో పెద్దగా లాభాలు లేకపోవడంతో షాట్‌వాల్‌, లాంగ్‌వాల్‌ వైపు సింగరేణి మొగ్గు చూపుతోంది. ఇటు ఉత్పత్తిని పెంచుకోవడంతో పాటు అటు లాభాలు సాధించడానికి ఆస్కారం ఉంది. షాట్‌వాల్‌ విధానం ద్వారా సంస్థకు లాభాలు పెరుగుతాయి. ఇది అమలు చేస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.