షెడ్యూల్‌ ప్రకారమే ఐదురాష్ట్రాల ఎన్నికలు


` ఒమిక్రాన్‌ తాజా పరిస్థితిపై ఈసీ సవిూక్ష
` ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు
` ఎన్నికలు జరిగే ఐదు రాష్టాల్లో వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలని సూచన
దిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి): దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతూ కలవరపెడుతున్న వేళ వచ్చే మరికొద్ది నెలల్లో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా వీటిని వాయిదా వేస్తే మంచిదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి లేదని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడిరచాయి. రాజ్యాంగం ప్రకారం.. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ వెలువరించే అవకాశాలున్నాయని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, గోవా శాసనసభల పదవీకాలాలు వచ్చే ఏడాది ముగియనున్నాయి. దీంతో 2022 మార్చి`ఏప్రిల్‌లో ఈ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. మరికొద్ది రోజుల్లో షెడ్యూల్‌ కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇదే సమయంలో దేశంలో ఒమిక్రాన్‌ ఉద్ధృతి నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేయాలంటూ పలు వర్గాల నుంచి అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర ముఖ్య అధికారులతో ఈసీ సోమవారం సమావేశమైంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు, వ్యాక్సినేషన్‌ కవరేజ్‌ సంబంధిత వివరాలను ఈసీ అధికారులను అడిగి తెలుసుకుంది. ఉత్తరాఖండ్‌, గోవాల్లో దాదాపు 100శాతం తొలి డోసు పూర్తవ్వగా.. ఉత్తరప్రదేశ్‌లో 85శాతం, మణిపూర్‌, పంజాబ్‌లలో 80శాతం వరకు తొలి డోసు పంపిణీ పూర్తయినట్లు అధికారులు ఈసీకి తెలిపారు. దీంతో టీకా పంపిణీ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ వేగాన్ని పెంచాలని ఎన్నికల సంఘం సూచించింది. వీలైనంత త్వరగా ఆయా రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ రెండు డోసులను అందించేలా చూడాలని కోరినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఎన్నికల్లో భద్రతా ఏర్పాట్లపై పారామిలిటరీ బలగాల చీఫ్‌లతోనూ ఈసీ సమావేశమైంది. ఇక, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర కమిషనర్లు రేపు ఉత్తరప్రదేశ్‌ సందర్శించి.. ఎన్నికల సన్నద్ధతను సవిూక్షించనున్నారు. జనవరిలో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో మరోసారి ఈసీ భేటీ కానుంది.