సంకర చేపల ఉత్పత్తకి యత్నం
రోగాలను తట్టుకుని ఉత్పత్తి పెంచే చర్యలు
మత్స్యశాఖ ప్రయత్నాలు
అమరావతి,జూలై31(జనం సాక్షి): దేశంలోని వివిధ ప్రాంతాల్లోని నదుల నుంచి సేకరించిన చేపలను మన చేపలతో సంకరపర్చి సత్ఫలితాలు సాధించేందుకు మత్స్యశాఖ ప్రయత్నిస్తోంది. స్వల్పకాలంలోనే ఎక్కువ బరువుతో చేపలు పెరగాలని.. రోగాలను తట్టుకోవాలని.. తద్వారా పెంపకందార్లు లాభాలు ఆర్జించాలని
మత్స్యశాఖ కృషిచేస్తోంది. ఎప్పుడూ స్థానికంగా లభించే చేపల ద్వారానే గుడ్ల ఉత్పత్తి సాధించి, ఆ చేప పిల్లల పెంపకం వల్ల అదనపు ప్రయోజనాలు చేకూరవని భావించిన మత్స్యశాఖ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశంలోని గంగ, యుమున, నర్మద నదుల నుంచి చేపలను సేకరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఫా నుంచి వీటిని సేకరించి మన ప్రాంత చేపలతో సంకరపర్చినట్లు రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు వెల్గించారు. దీంతో మేలుజాతి చేపల ఉత్పత్తి సాధ్యమవుతుందని ఆ శాఖ భావించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద ఉన్న బాదంపూడిలో బ్రూడర్లు(తల్లి చేపలను) పెంచుతోంది. వీటిని తల్లి చేపలుగా ఎదగటానికి కొంత సమయం పడుతుంది. 18 మాసాల తరువాత ఇవి గుడ్ల ఉత్పత్తికి వస్తాయి. అనంతరం వాటిని పొదిగిన తర్వాత చేప పిల్లల్ని రైతులకు సరఫరా చేస్తారు. ప్రస్తుతం 12 నెలలు
పెంచితేకాని కిలో చేప పెరగటం లేదు. ఇలాంటి ప్రయత్నం వల్ల 10 నెలల వ్యవధిలోనే అనుకున్న పరిమాణం వస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల రైతుకు రెండు నెలల మేత ఖర్చు రూపంలో ఆర్థిక భారం తగ్గుతుంది.