సంక్రాంతి అంటే సరదాలే

 

కోడి పందాల కోసం భారీగా ఏర్పాట్లు

అమరావతి,జనవరి14(జ‌నంసాక్షి): రంగవల్లులు…భోగి మంటలు..పిండివంటలు…డూడూ బసవన్నలు..హరిదాసులు…సంప్రదాయ వస్త్రాలు..ఇల్లంతా బంధువులు… ఆనంద డోలికలు…మూడ్రోజుల తెలుగింటి పెద్దపండగ ఇవీ మన సంక్రాంతి పర్వదినం ప్రత్యేకతలు. కానీ కొందరు మాత్రం తసంక్రాంతి సంప్రదాయం ముసుగులో కోడి పందాలే పండగగా భావిస్తున్నారు. పందెంరాయుళ్లు ఇప్పటికే వందల సంఖ్యలో మేలు జాతి కోడి పుంజులు, రూ.లక్షల నగదు సిద్ధం చేసుకుని బరిలోకి దిగటానికి ఉవ్విళ్లూరుతున్నారు. పందేల కోసం వస్తున్న వారికి సకల సౌకర్యాలతో ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి వస్తుందంటే బాపట్లకు చెందిన పందెంరాయుళ్ల సందడి అంతా, ఇంతా కాదు. నాలుగైదు రోజులపాటు

వీరంతా పూర్తిగా పందేల్లో మునిగి తేలుతుంటారు. ఇప్పటికే కోడి పుంజలను తీసుకుని ఖరీదైన కార్లలో ఉభయగోదావరి జిల్లాలకు తరలివెళ్లారు. రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు పందేల లెక్కన ఆయా మూడ్రోజుల్లో రూ.5 కోట్ల మేర చేతులు మారనున్నట్లు అంచనా. రాత్రిళ్లూ వీటి నిర్వహణకు ఫ్లడ్‌లైట్లను అమర్చుతున్నారు. ప్రజాప్రతినిధుల చేతుల విూదుగా ఇవి ప్రారంభంకానున్నట్లు తెలిసింది. పందేలను తిలకించటానికి బాపట్ల, రేపల్లె, పొన్నూరు, ప్రత్తిపాడు, తెనాలి, వేమూరు నియోజకవర్గాలతోపాటు కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. బాపట్ల పట్టణంతోపాటు, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవారిపాలెం మండల గ్రామాలకు చెందిన పదుల సంఖ్యలో పందెంరాయుళ్లు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, భీమడోలు, నల్లజర్ల, దేవరపల్లి ప్రాంతాలకు స్నేహితులతో కలిసి వెళ్లారు. వీరి కోసం ఆ ప్రాంతంలో ప్రత్యేక బస, భోజన ఏర్పాట్లు చేశారు. వాటిలో రూ.లక్షలు పోగొట్టుకుంటున్నా ఆడటం మాత్రం ఆగటం లేదు. పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా స్థానికంగా రహస్య ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. పోలీసులు చిన్న, చిన్న వాటిని మాత్రమే అడ్డుకోగలుగుతున్నారన్న విమర్శలున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని

నిబంధనలకు విరుద్ధంగా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పందేలు నిర్వహిస్తే చట్టపరమైన

చర్యలు తప్పవని హెచ్చరించారు.

——————