సంక్రాతికి రెడీ అవుతున్న పందెంకోళ్లు?

నిబంధనలు ఉన్నా ఏటా తప్పని తిప్పలు
ఏలూరు,జనవరి3(జ‌నంసాక్షి): సంత్రాంతి వస్తుందంటే గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల హడావిడి కనిపిస్తుంది. ఏటా పందాలప ఆంక్షలు..పోలీసుల చర్యలు షరామామూలే అయినా కోడిపందాలను అడ్డుకోవడం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎక్కడిక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. పందేలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని మండలాల్లోనూ ఎస్‌ఐ, తహశీల్దారు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అయితే ఈ యేడు కూడా మళ్లీ హడావిడి సాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో వాటి నిరోధానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.  ఆదేశాలు ఏవిూ చేయలేవంటూ పందెంరాయుళ్లు తమ ఏర్పాట్లలో ఉన్నారు.  చట్టం అమలులో నిర్లిప్తత వహిస్తే తహశీల్దార్లు, పోలీసు అధికారులపై జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. ఆదేశాల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోకపోవడంతో ప్రభుత్వానికి, అధికారులకు చట్టాన్ని అమలు చేసే ఆలోచన కన్పించడం లేదని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా మాదిరిగా బైండోవర్‌ కేసుల లెక్కలు చెప్పడం మినహా కోడిపందేలను అడ్డుకునేందుకు పోలీసులు కనీస చర్యలు తీసుకున్న పరిస్థితి కన్పించడం లేదు. ఈసారీ జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు యథేచ్ఛగా కొనసాగడం, రూ.వందల కోట్లు చేతులు మారడం తథ్యమనే సంకేతాలు కన్పిస్తున్నాయి. పందాలు సంప్రాదాయం ప్రకారం జరిగేవని నేతలు అంటున్నారు. నిషేధం అమలు చేయడంలో పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో అని చూస్తున్నారు.