సంక్షోభంలో వ్యవసాయ రంగం
స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి
ఏలూరు,జూలై20(జనం సాక్షి): దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని కౌలు రైతు సంఘ నేతలు అన్నారు. బడా కంపెనీలకు లాభం చేకూర్చేందుకు వ్యవసాయ భూములు లాక్కుని రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత పథకాలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ విధానాలతో రైతులు, వ్యవసాయకూలీలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. చంద్రబాబు నిర్ణయాలతో వ్యవసాయ రంగం పరిస్థితి మరింత దిగజారిందన్నారు. వ్యవసాయరంగాన్ని రక్షించుకునేందుకు రైతులు, వ్యవసాయకార్మికులు, కౌలు రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హావిూ అమలు చేయాలని డిమాండ్‌చేశారు. చంద్రబాబు హయాంలో నీటి తీరువా వసూలు చేసే పద్ధతి ప్రవేశపెట్టారని అన్నారు. తెలిపారు. విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడం, మార్కెట్ నియంత్రణ లేకపోవడం వంటివి ఆయన హయాంలోనే చోటు చేసుకున్నాయన్నారు. ప్రపంచంలో భూతాపం పెరిగిపోయి వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నదని అన్నారు. వ్యవసాయ రంగంపై అధ్యయనం చేసేందుకు 52 కమిషన్లు వేశారని, ఒక్క కమిటీ సిఫారసు కూడా అమలు చేయలేదని తెలిపారు. ఆర్థిక సంస్కరణల కారణంగా దేశంలో వ్యవసాయ రంగం కుదేలైందన్నారు. స్వదేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులను కూడా దిగుమతి చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయని వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రభుత్వరంగం నిర్వీర్యమవుతుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి బిసి, మైనార్టీలకు ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఢిల్లీ తరహాలో కార్పొరేట్ కాలేజీల్లో, స్కూళ్లలో ఫీజుల నియంత్రణ ఉండాలని డిమాండ్ చేశారు. సహజ వాయువుల వెలికితీతతో సారవంతమైన భూములు నాశనం కావడమే కాకుండా పర్యా వరణానికి పెనుముప్పు వాటిల్లుతుందన్నారు. జిల్లాలోని అండలూరు, కృష్ణా జిల్లా మోదుగుమూడి, కొమరళ్లపూడి తీరప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. దీనివల్ల ఉత్ఫన్నమయ్యే మిథేన్ భూతాపాన్ని పెంచుతుందని, అణుధార్మిక రాడన్ వాయువు వెలువడి వాయుకాలుష్యం ఏర్పడుతుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారని తెలిపారు.