సచివాలయ ఉద్యోగుల భూముల్లో అక్రమాలు
విజిలెన్స్ నివేదిక మేరకు చర్య తీసుకోవాలి
ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ గవర్నర్‌కు ఫిర్యాదు
హైదరాబాద్,ఆగస్ట్24 (జనంసాక్షి): సచివాలయ సొసైటీ భూముల అక్రమాలపై చర్య తీసుకోవాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఇందులో అనేక అక్రమాలుచోటు చేసుకున్నాయని తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఉమ్మడి సచివాలయంలో 11 గుర్తింపు పొందిన సంఘాల సభ్యులు ఏర్పాటు చేసుకున్న గృహనిర్మాణ సొసైటీ.. 2002లో గృహనిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందన్నారు. దీనిపై స్పందించిన అప్పటి ప్రభుత్వం.. వివిధ ప్రాంతాల్లో 976 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. గోపన్‌పల్లిలో 477 ఎకరాలు, గచ్చిబౌలిలో 38 ఎకరాలు, నేక్‌నాపూర్‌లో 59 ఎకరాలు, జవహర్‌నగర్‌లో 100 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. ఈ
వ్యవహారంలో సొసైటీ అధ్యక్షుడు, ఇతర డైరెక్టర్లు మొదటి నుంచి అవకతవకలకు పాల్పడటంతో అందిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. దీనిలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం 2010 జులై 29న నివేదిక అందజేసినట్లు పద్మనాభరెడ్డి వివరించారు.
ప్లాట్ల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు విజిలెన్స్ నిగ్గు తేల్చిందన్నారు. దీనిపై విజిలెన్స్ విభాగం పలు సిఫార్సులతో కూడిన నివేదిక ప్రభుత్వానికి అందచేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో తొమ్మిదేళ్ల నాటి విజిలెన్స్ నివేదికపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు పద్మనాభరెడ్డి వివరించారు. దీనిపై తక్షణ చర్యలకు ఆదేశించాలన్నారు.