సత్యం రామలింగరాజుకు ఏడేళ్ల జైలుశిక్ష
రూ. 5 కోట్లు జరిమానా విధించిన కోర్టు
సోదరుడు రామరాజుకు కూడా ఇదే శిక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 9: దేశంలో సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణంలో సత్యం రామలింగరాజుకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఏ1 నుంచి ఏ10 వరకూ ఉన్న మొత్తం పది మందికీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిలో కొందరికి రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు కోర్టు జరిమానా విధించింది.
సత్యం రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజుపై ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 కోట్లు జరిమానాను కోర్టు విధించింది. 2006లోనే ఈ కుంభకోణానికి అంకురం పడింది. కాని ఆ తర్వాత మూడేళ్లకి రామలింగరాజు స్వయంగా తాను ఈ కుంభకోణానికి పాల్పడినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ కేసు గురించి తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాషా్ట్రలతోపాటు ఢిల్లీనుంచి వచ్చిన విలేఖరులతో ఆ ప్రాంగణం నిండిపోయింది. కొంతమంది విదేశీ పాత్రికేయులు కూడా ఈ కేసు మీద ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చారు.