సత్వరమే సహయక చర్యలు చేపట్టాలి

– ఇసుక మేటలు వేసిన పొలాల్లో సర్వే చేయాలి
– యుద్దప్రాతిపదికన విద్యుత్‌ సరఫరా పునరుద్దరించాలి
– జిల్లా ప్రత్యేక అధికారి, కలెక్టర్‌తో జెడ్పీ చైర్మన్‌ సమీక్ష
జనంసాక్షి, మంథని : భారీ వర్షాలు, వరదలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో వెంటనే సహయక చర్యలు చేపట్టాలని జిల్లా ప్రత్యేక అధికారి,జిల్లా కలెక్టర్‌లను జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ కోరారు. శుక్రవారం ఎన్‌టీపీసీ ఇల్లెందు గెస్ట్‌ హౌజ్‌లోజిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్‌ సంగీత సత్యనారాయణ, జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌లతో ఆయన ప్రత్యేక సమావేశమై వరద ముంపు ప్రాంతాల్లో చర్యలపై చర్చించారు. బారీ వర్షాలతో గోదావరి, మానేరు నదులు ఉదృతంగా ప్రవహించడంతో గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో పంటల పొలాలు, ఇండ్లకు నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానేరు నది పరివాహక ప్రాంతాల్లో వరద నీటితో పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయని,ఇసుక మేటలు వేసి నష్టపోయిన పంట పొలాల సర్వేకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా వ్యవసాయానికి సంబంధించిన అనేక గ్రామాల్లో వరద ఉదృతికి విద్యుత్‌ స్థంబాలు, వైర్లు నేలమట్టమై విద్యుత్‌ సరఫరా నిలిచి పోయిందని, ఈ క్రమంలో యుద్దప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించేలా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. వరదలతో ఇబ్బందులు పడ్డ రైతులకు, ప్రజలకు అవసరమైన సహయక చర్యలు చేపట్టి వారికి సాయం అందించాలని ఆయన వారికి కోరారు. మానేరు, గోదావరినదులు ప్రవహించే మంథని నియోజక వర్గంలోని పరివాహన మండలాలు, గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్‌లను కోరారు. జెడ్పీ చైర్మన్‌ వెంట కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్‌ దాసరి రాజలింగు ఉన్నారు.

తాజావార్తలు