సఫారీల వేట.. శ్రీలంక టాటా!
క్రికెట్ మెగా వార్ వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా హిస్టారికల్ విక్టరీతో సెమీఫైనల్లో ప్రవేశించింది. సిడ్నీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో సఫారీ గ్యాంగ్ చరిత్ర తిరగరాసింది. మేజర్ టోర్నీల్లో ఇప్పటివరకు ఒక్క నాకౌట్ మ్యాచ్ గెలవని సౌతాఫ్రికా దశాబ్దాల నిరీక్షణకు తెరదించింది. అద్భుత ఆటతీరుతో చెలరేగుతున్న సఫారీ గ్యాంగ్ క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసింది.
సిడ్నీ ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్ లో శ్రీలంక అనూహ్య రీతిలో సరెండరైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగానే అందరూ సౌతాఫ్రికా పనైపోయిందనుకున్నారు. స్పిన్ వ్యూహంతో సౌతాఫ్రికాను దెబ్బ తీయానుకున్న శ్రీలంకకు సీనర్ రివర్సైంది. ఇమ్రాన్ తాహీర్, డుమినీ స్పిన్ సునామీలో లంక సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఆరంభంలో కైల్ అబాట్, డెల్ స్టెయిన్ లంకను దెబ్బ తీశారు. ఓపెనర్ కుశాల్ పెరీరాను 3 పరుగులకు అబాట్ ఔట్ చేయగా… ఫాంలో ఉన్న దిల్షాన్ ను స్టెయిన్ డకౌట్ చేశాడు. తర్వాత తాహీర్-డుమినీ మ్యాజిక్ మొదలైంది.
సుడులు తిరిగే బంతులతో తాహీర్, డుమినీ లంకను తిప్పేశారు. డుమినీ హ్యాట్రిక్ తో చెలరేగాడు. వీళ్లిద్దరి ధాటికి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. జయవర్ధనే 4, మాథ్యూస్ 19 పరుగులకే వెనుదిరిగారు. ఆల్ రౌండర్ పెరీరా డకౌటయ్యాడు. 37.2 ఓవర్లలో లంక కేవలం 133 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బౌలర్లలో తాహీర్ 4 వికెట్లతో అదరగొట్టగా.. డుమినీ 3 వికెట్లు పడగొట్టాడు.. అబాట్, స్టెయిన్, మోర్కెల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. లంక బ్యాటింగ్ ఆర్డర్లో ఒంటరి పోరాటం చేసిన సంగక్కర 96 బంతులాడి 45 పరుగులు చేసి ఔటయ్యాడు.
స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ ఆమ్లా 16 పరుగులకు ఔటయ్యాడు. ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత మరో ఓపెనర్ డికాక్ అదరగొట్టాడు. టోర్నీలో తొలిసారిగా రాణించిన డికాక్ లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 56 బంతుల్లోనే 11 ఫోర్లతో డికాక్ 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. డూప్లెసిస్ తో కలిసి రెండో వికెట్ కు 118 పరుగులు జోడించి సౌతాఫ్రికాను గెలిపించాడు. డూప్లెసిస్ 21 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సౌతాఫ్రికా కేవలం 18 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ఛేజ్ చేసింది.
9 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ కొట్టిన సౌతాఫ్రికా వరల్డ్ కప్ కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. 4 వికెట్లు పడగొట్టిన ఇమ్రాన్ తాహీర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. నాలుగో సారి వరల్డ్ కప్ సెమీఫైనల్ కు చేరుకుంది.