సభకు స్వచ్ఛందంగా తరలి రావాలి: ఎమ్మెల్సీ

జనగామ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కొంగర్‌కలాన్‌లో చేపట్టిన ప్రగతినివేదన సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ కేసీఆరే సీఎం అని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లా నుంచి భారీ ఎత్తున సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. నాలుగేండ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని అన్నారు. అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి 100సీట్లు రావడం ఖాయమని, ఎన్ని సర్వేలు చేసినా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం దుర్లభమని అన్నారు. కాళేశ్వరం నీటితో తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులకు 365 రోజులపాటు నీరు అందించడంతో చెరువలునీ సస్యశ్యామలమయ్యాయని అన్నారు. రాష్ట్రంలో సబ్బండ వర్గాలు, కులాలు, మతాలకు సమ న్యాయాన్ని, సంక్షేమ ఫలాలు, ఆత్మగౌరవాన్ని కల్పిస్తూ బిందె నీళ్ల కోసం గోసపడిన పల్లెల్లో గలగలా గోదావరి జలాలను పారిస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలన ఫలాలు అందుకున్న లబ్ధిదారులు, ప్రజలు, అన్నివర్గాలు టీఆర్‌ఎస్‌ సభకు స్వచ్ఛంధంగా తరలివచ్చేందుకు సిద్ధపడుతున్నారని చెప్పారు. సాధించుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చి దిద్దుతున్నారనిఅన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన పాలనకాలంలో చేసిన ప్రగతిపై ప్రోగ్రెస్‌ రిపోర్టు ఇస్తుందని అన్నారు. అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులను సభకు తరలించారని కోరారు.