సభ మీ సొంతం కాదు
` జగదీష్ రెడ్డి వర్సెస్ స్పీకర్
` స్పీకర్ చైర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగదీష్ రెడ్డి సస్పెన్షన్
` సమావేశాలు ముగిసేవరకు వేటు
` పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే
` మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
` దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం: సీతక్క
` ఎథిక్స్ కమిటీకి అప్పగించాలని డిమాండ్
హైదరాబాద్(జనంసాక్షి):మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సస్పెండ్ అయిన సభ్యుడిని సభ నుంచి బయటకు పంపాలని స్పీకర్ ఆదేశించారు. కాగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళం సృష్టించాయి. ’విూరు మేము ఎన్నకుంటేనే స్పీకర్ అయ్యారు. సభ విూ ఒక్కరిదీ కాదు ` సభ అందరదీ’ అని స్పీకర్‌ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి అన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకుముందు జగదీష్ వ్యాఖ్యలపై శాసనసభలో వాడీవేడీ చర్చ జరిగింది. సభ లోపల, బయట స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏకవచనంతో స్పీకర్‌పై మాట్లాడటం బాధాకరమన్నారు. స్పీకర్‌ను అవమానించకుండా ఆదర్శంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించాలని.. అప్పటి వరకు ఈ సేషన్ మొత్తం ఆ సభ్యున్ని సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈరోజు సభ్యుడు మాట్లాడిన భాష అత్యంత అవమానకరమన్నారు. ఒక దళితజాతి బిడ్డ స్పీకర్‌గా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని.. స్పీకర్‌ను టార్గెట్ చేయడం బాధాకరమన్నారు. ఆ సభ్యుని సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. బలహీన వర్గాలు ఇప్పుడిప్పుడే ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక… బీఆర్‌ఎస్ అడిగినన్ని సార్లు అవకాశం ఇచ్చారన్నారు. జగదీష్ రెడ్డి అత్యంత అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. విూకు విూకు అని మాట్లాడడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. గవర్నర్‌ను పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్త అని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గవర్నర్ మాట్లాడిరది.. తమ ప్రభుత్వ విధానం అని కేసీఆర్ సభలో చెప్పలేదా అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను దారుణంగా అవమానించారన్నారు. జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్‌ను కోరుతున్నాని మంత్రి సీతక్క తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లను సస్పెండ్ చేశారన్నారు. పార్లమెంట్‌లో టీఎంసీ సభ్యుడు ప్రవర్తన సరిగా లేనందున సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. జగదీష్ రెడ్డిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. సభ్యులు చర్చ అనంతరం జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.అయితే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరగా.. అందుకు స్పీకర్ అనుమతి ఇవ్వక పోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు వచ్చేశారు. సస్పెండ్ అనంతరం బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కూర్చున్న జగదీష్ రెడ్డిని అసెంబ్లీ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని చీఫ్ మార్షల్ కోరారు. అయితే సభా వ్యవహారాల నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని చీఫ్ మార్షల్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వాదించారు. ఏ రూల్ ప్రకారం బయటికి పంపాలని చూస్తున్నారని అడిగి రావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెప్పారు. దీంతో చీఫ్ మార్షల్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
శాసనసభ స్పీకర్ నుద్దేశించి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్ర శాసనసభలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ భారత పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకరే సుప్రీం అని ఆయన తేల్చిచెప్పారుజగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ పార్లమెంటరీ వ్యవస్థను అవమానించడమే నని ఆయన పేర్కొన్నారుస్పీకర్ ను ప్రశ్నించే అధికారం ఏ ఒక్కరికీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.దళిత జాతికి చెందిన సీనియర్ నేత స్పీకర్ హోదాలో ఉన్న అటువంటి వ్యక్తి పై చేసిన వాక్యాలు ఆయన ఆహంకార ధోరణిని బయట పెట్టినట్లయిందని ఆయన అన్నారు.ఈ తరహాలో ఏ సభ్యుడు మాట్లాడినా ఊపేక్షింది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారుగతంలో వారు అధికారంలో ఉండగా ఇదే సభలో గవర్నర్ ప్రసంగం సమయంలో అప్పటి సభ్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి,సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దు అంశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.స్పీకర్ కు ఏమి అధికారం ఉందంటూ స్పీకర్ వ్యవస్థను, శాసనసభ వ్యవస్థతో పాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమాన పరిచే విదంగా మాట్లాడిన సదరు సభ్యుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ…ఈ అంశాన్ని శాసనసభ ఎథిక్స్ కమిటీకి పంపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
నేడు బీఆర్‌ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
` సస్పెనషన్‌కు భయపడేదిలేదు
` ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి ఎన్నో దుర్మార్గాలను ఎదుర్కొన్నాం: జగదీష్ రెడ్డి
` ఉద్దేశ్యపూర్వకంగా చేశారు: కేటీఆర్
` ఏకపక్ష నిర్ణయం: హరీశ్‌రావు
హైదరాబాద్(జనంసాక్షి):జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రేపు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి.. అప్రజాస్వామికమైన పోకడల గురించి నిరసన తెలిపేందుకు రచించిన అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం వద్దకు వెళ్లి కూర్చునేందుకు అవకాశం లేకుండా గేట్లు మూసేశారు. ఆ మహానుభావుడిని సంకెళ్లతో బంధించిన నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా.. పేరుకేమో ప్రజాపాలన.. చేసేవన్నీ అప్రజాస్వామిక పనులు అన్నట్లుగా ఉంది’ అని విమర్శించారు.
సస్పెనషన్‌కు భయపడేదిలేదు:జగదీశ్ రెడ్డి
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎన్నో దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చామని.. ఈ సస్పెన్షన్ తనను ఏమాత్రం భయపెట్టలేదని సూర్యాపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులతో కలిసి అంబేద్కర్ భారీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో.. శాసనసభలో ఏం జరుగుతుందో ప్రజలంతా చూశారు. మేం మాట్లాడుతున్న సందర్భంలో దురదృష్టవశాత్తు.. శాసనసభలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడుతున్న దాన్ని లైవ్ కూడా ఇవ్వడం లేదని ప్రజలు మాకు చెబుతున్నరు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం నిజాలు దాచిపెడుతామనుకుంటే సాధ్యం కాదని అన్నారు. శాసనసభలో ఒక్కరోజు కూడా అన్‌పార్లమెంటరీ వర్డ్ కానీ, ఇతరులను కించపరిచేవిధంగా, శాసనసభ హుందా తనాన్ని తగ్గించే విధంగా కానీ నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రత్యేకించి చైర్‌కు సంబంధించి.. స్పీకర్ అధికారాలు ఏందో.. స్పీకర్ విధులు ఏంటో అన్నీ నాకు తెలుసు. ఎక్కడా కూడా స్పీకర్ గౌరవానికి భంగం కలిగించే పద్ధతుల్లో మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. ఈ చర్యకు స్పీకర్ సమ్మతిస్తరని నేను అనుకోవడం లేదు. ఎంత దురదృష్టకరమంటే.. జరిగింది చర్చ నాకు, కాంగ్రెస్ పార్టీకి మధ్యన. స్పీకర్ పెద్దమనిషిగా.. రెఫరీగా ఉంటారు కాబట్టి.. ఆయనను పదేపదే రిక్వెస్ట్ చేశాను. కాంగ్రెస్ సభ్యులు ఇద్దరు 1.20గంటలు మాట్లాడారు. అప్పుడు మా సభ్యులు అభ్యంతరం తెలుపలేదు.. వారు సాఫీగా మాట్లాడుకున్నరు’ అని తెలిపారు.స్పీకర్ నాకు అవకాశం ఇచ్చారు. బీఆర్‌ఎస్ తరఫున మాట్లాడేందుకు కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారు. నేను దానికి సంబంధించి రాత్రి జిల్లాలోని రైతులు, అన్నివర్గాల ప్రజలతోని మాట్లాడాను. వాళ్ల సమస్యలను ఎలా ప్రతిబింబించాలి.. రాష్ట్రంలో ఎండిపోతున్న పొలాలు, అక్కడ రైతులు చెబుతున్న బాధలు.. వివిధ వర్గాల ప్రజలు ఎలా మోసపోయోమని చెబుతున్నరో.. వాటన్నింటిని శాసనసభలో మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశాను. అందులో ఎక్కడా ఒక్క తప్పుమాట, పొరపాటు మాట.. స్పీకర్‌ను కించపరిచే మాట లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది. ప్రభుత్వం బట్టలు విప్పే మాట ఉంది.. ఉండి తీరుతుందని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షంగా మా బాధ్యత అన్నారు. శాసనసభలో ఆపినంత మాత్రానా.. ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు’ అని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఉద్దేశ్యపూర్వకంగా సస్పెండ్ చేశారు: కేటీఆర్
జగదీశ్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్ చేశారని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ తర్వాత భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…స్పీకర్ పట్ల జగదీశ్‌రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదు. అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏవిూ మాట్లాడకపోయినా.. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేయడం దారుణం అన్నారు. స్పీకర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాను చేసిన తప్పేంటని వివరణ అడిగే అవకాశం కూడా జగదీశ్‌రెడ్డికి ఇవ్వలేదు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయాలని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆదేశించాలన్నారు. ఇదే విషయాన్ని స్పీకర్, మంత్రి శ్రీధర్‌బాబుకు స్పష్టంగా చెప్పాం. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని కోరాం. అయినా, పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలతో సభను 5 గంటలపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులతో మాట్లాడిరచి.. జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటారని కేటీఆర్ అన్నారు.
ఏకపక్ష నిర్ణయం: హరీష్ రావు
సూర్యాపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. జగదీశ్ రెడ్డిని ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించగానే.. హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా చివరిసారిగా మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు సర్.. విూరు ప్రధాన ప్రతిపక్షానికి విూరు మైక్ ఇవ్వరా సర్ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సభలో మాట్లాడేందుకు మాకు ఎందుకు అవకాశం ఇవ్వరని హరీశ్‌రావు సభాపతిని ప్రశ్నించారు.స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వచ్చారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభ నుంచి బయటకు వచ్చిన జగదీశ్ రెడ్డి కేసీఆర్ ఛాంబర్‌లో కూర్చున్నారు. అక్కడ్నుంచి కూడా వెళ్లిపోవాలని చీఫ్ మార్షల్ జగదీశ్ రెడ్డికి సూచించారు. సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని బీఆర్‌ఎస్ సభ్యులు చీఫ్ మార్షల్‌కు సూచించారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కూర్చుంటే అభ్యంతరమేంటని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.