సమయస్ఫూర్తితో వ్యవహరిచిన వైద్యులు
రోగికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో భూకంపం సంభవిస్తే.! ఆపరేషన్ చేసే వైద్యులు, సహాయక సిబ్బంది, రోగి పరిస్థితి ఏంటి.? ఆపరేషన్‌ను వదిలి ప్రాణభయంతో వైద్యులు ఆపరేషన్ థియేటర్‌ను వీడిపోతారా? అదే జరిగితే రోగి పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని స్కిమ్స్ ఆస్పత్రి వైద్యులకు సోమవారం ఎదురైంది. కానీ వైద్యులు మాత్రం గుండె నిబ్బరంతో విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి రోగికి ప్రాణదానం చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే…
ఆప్ఘన్, పాకిస్థాన్ దేశాల్లో తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం ఏర్పరచిన భూప్రకంపనలు ఉత్తరభారతావనిని కూడా వణికించిన విషయం తెల్సిందే. సరిగ్గా ఈ ప్రకంపనలు సంభవించినపుడు స్కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ థియేటర్‌లో రోగికి శస్త్ర చికిత్స చేస్తున్నారు. కానీ, ఇతర వైద్యులు, సిబ్బందిలా వారు ఆపరేషన్ థియేటర్ వదిలి పరుగులు పెట్టలేదు.
తొలుత భూప్రకంసపనలతో షాక్ తిన్నా.. డాక్టర్లు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహించారు. మిగతా నర్సులు, డాక్టర్లు భయంతో పరుగులు పెడుతున్నా.. ఆపరేషన్ చేసే డాక్టర్లు మాత్రం ఆందోళనకు తావివ్వకుండా థియేటర్ గోడలను పట్టుకుని అక్కడే ఉండిపోయారు. భవనం ఊగిపోతున్నా, వెంటిలేటర్ మీద రోగిని పరీక్షిస్తూ, ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు.