సమరానికి “సై” ……!

ఒక్క “మొక్క” నాటలేదు
చుక్క “నీరు” పోయలేదు
ఏ “పాదు” తీయలేదు
ఏ “పెంపు” చెయ్యలేదు
మా ఆకుల తెంపే  “హక్కు” మీకెక్కడిది ?
మా అడవిని తొలిచే “అధికారం” ఎప్పడిది?

ఏ అడుగు ఇటు వెయ్యనోడివి
ఏ బాగోగుల జూపనోడివి
ముక్కు ముఖం తెల్వనోడివి
ఇక్కడి మట్టి ముట్టే  “దైర్యం” మీకెక్కడిది?
ఆటవీ సంపద దోచే అజమాయిషీ మీకెన్నడిది?

ఎక్కడి నుంచో వచ్చి
మా “వనరుల” దోచుకుంటానంటే…
జీవ జాతుల విధ్వంసం చేస్తానంటే…
పర్యావరణం హననం గావిస్తానంటే

మేమే కాదు!
“నల్లమల” ప్రతీ ప్రాణి సహించవు
సరి కదా!
సమరానికి “సై” అంటాయ్

చలి చీమలు “దండు” కడతాయ్
కోయిలలు “ఉద్యమ”పాటలైతాయ్
పాల పిట్టలు “తూటా”లై  పేలుతాయ్
లేడి కూనలు “ఉగ్ర”సింహాలై  గర్జిస్తాయ్
తేనెటీగలు “బరిసె”లై  చీల్చుతాయ్
చిగురుటాకులు “బాంబు”లై  పేలుతాయ్
మట్టి పురుగులు “మందుపాతర”లై
విధ్వంసం సృష్టిస్తాయ్

ఓ పెట్టుబడిదారు కర్కోటకులారా!
వంత పాడు “పాలక” శ్రేణుల్లారా!
యురేనియం తవ్వకాలు మానండి
స్వార్థపూరిత కుట్రలు తుడిచేయండి
మీ దోపిడీ చేష్టలు ఇక చాలించండి
“”””””‘””””””””
(యురేనియం తవ్వకాలపై అడవి బిడ్డల
ఆత్మ ఘోష అక్షరీకృతం చేస్తూ…)

                 కోడిగూటి తిరుపతి
(జాతీయ ఉత్తమ కవి పురస్కార గ్రహీత)
Mbl no: 9573929493

తాజావార్తలు