సమర్ధవంతులకే..  ప్రజలు పట్టం కడతారు


– నిత్యం ప్రజల మధ్య ఉండి వారికి సేవలందించాలి
– సభ్యత్వ నమోదును వేగవంతం చేయండి
– సీబీఐని భాజపా కలెక్షన్‌ బ్యూరోగా మార్చేసింది
– వైకాపా, జనసేన, తెరాసలు ఒకేతానులో గుడ్డలు
– భాజపాయేతర పార్టీలను ఏకతాటిపైకి రాకుండా చేయడమే వీరి అజెండా
– మోదీని ఒక్కమాట అనని వీరు.. తెదేపాను టార్గెట్‌ చేస్తున్నారు
– టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, నవంబర్‌ 21(జ‌నంసాక్షి) : సమర్ధవంతంగా పనిచేసిన వారికే ప్రజలు పట్టం కడతారని, వారి సమస్యల పరిష్కారంలో భాగస్వాములైన వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం సీఎం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ
సందర్భంగా బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉండాలన్నారు. నాయకులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సభ్యత్వ నమోదు ఇప్పటి వరకు 16,21,738కు చేరుకుందని, సభ్యత్వ నమోదు వేగం పెంచాలని చంద్రబాబు సూచించారు. మనది తెలుగుదేశం కుటుంబమని, అందరినీ కలుపుకునిపోతామని ఆయన అన్నారు. ఇప్పటివరకు 39,585 మంది బూత్‌ కన్వీనర్లను నియమించామని, ఇంకా 6,035 మంది బూత్‌లకు కన్వీనర్లను నియమించాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. బూత్‌ కన్వీనర్ల శిక్షణను విజయవంతం చేయాలని టీడీపీ నేతలకు సూచించారు. ఈ ఐదేళ్లలో అనేక మందికి పదవులు ఇచ్చామని, రాబోయే ఐదేళ్లలో ఇంతకు మించి పదవులు ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధే మనందరి కులమని, పేదల సంక్షేమమే మన మతం అని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షాలు కుల, మత విభేదాలతో రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. నెల్లూరు ధర్మపోరాట సభ విజయవంతమయిందని, ఇదే స్ఫూర్తితో మిగతా మూడు ధర్మపోరాట సభలు జయప్రదం కావాలని చంద్రబాబు సూచించారు. కలెక్షన్‌ బ్యూరోగా భాజపా సీబీఐని మార్చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. సీబీఐలో పీఎంవో జోక్యంపై ఆ శాఖ అధికారే వెల్లడించారని చెప్పారు. భాజపా, వైకాపా, తెరాస, జనసేన ఒకే తానులో గుడ్డలని చంద్రబాబు విమర్శించారు. జగన్‌, కేసీఆర్‌, పవన్‌ అజెండా ఒక్కటేనని.. ఈ ముగ్గురూ నరేంద్రమోదీని విమర్శించబోరని, తెలుగుదేశం పార్టీనే లక్ష్యం చేసుకొంటారని ఆరోపించారు. భాజపాయేతర పార్టీలు ఏకతాటిపైకి రాకుండా చేయాలనేదే వీళ్ల అజెండా అని సీఎం మండిపడ్డారు.
కేసీఆర్‌ విమర్శలపై ప్రజల్లోకి..
తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న విమర్శలపై ప్రజల్లోకి వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను.. చంద్రబాబు అడ్డుకుంటున్నారని కేసీఆర్‌ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇరిగేషన్‌ అధికారులతో సమావేశం అయ్యారు. స్టేటస్‌ నోట్‌ తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్ధిష్ట విధానం పాటించాలనే కోరుతున్నామని, ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు ఏవిూ చేయలేదని అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టులకు అపెక్స్‌ కమిటీ ఆమోదం పొందాలని కోరామని అధికారులు తెలిపారు. ఏపీ విధానం, కేంద్రానికి రాసిన లేఖలోని అంశాలను.. తెలుగు ప్రజలకు వివరిద్దామని చంద్రబాబు అన్నారు.