సమసిపోయిన వివాదం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : జిల్లా విద్యాశాఖ అధికారి, ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం కలెక్టర్‌, ఉద్యోగ సంఘాల నేతల జోక్యంతో సమసిపోయింది. కొన్ని రోజులుగా డీఈఓ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల ఉద్యోగులు నిరసనకు దిగారు. జిల్లా విద్యాధికారి ఉద్యోగులను పరుష పద జాలంతో దూషించడం, నాలుగో తరగతి ఉద్యోగులతో ఇంట్లో పనులు చేయించడంతో ఆగ్రహించిన ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ డీఈఓను సరెండర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. డీఈఓపై చర్యలు తీసుకోకపోతే సహాయ నిరాకరణ చేపడతామని ఉద్యోగులు హెచ్చరించారు. డీఈవో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేధింపులకు గురిచేయడమే కాకుండా నాలుగో తరగతి ఉద్యోగులతో ఇంట్లో పనులు చేయిస్తూ   వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఉద్యోగులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.డీఈవో వ్యవహార శైలి బాగాలేదని ఆయన తనిఖీల పేరిట ఉపాధ్యాయులను అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడటం వంటి ఆరోపణలు ఉన్నాయి. డీిఈవోల మధ్య వివాదం ముదరకముందే జిల్లా కలెక్టర్‌ అశోక్‌, ఉద్యోగ సంఘం నేతలు కల్పించుకొని వారితో చర్చలు జరిపారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఇక నుంచి సభ్యంగా ఉంటానని హామీ ఇవ్వడంతో శాంతించిన ఉద్యోగులు తలపెట్టిన సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నారు.