సమస్యలను పరిష్కరించాల్సిందే

అదిలాబాద్‌, నవంబర్‌ 23 : సింగరేణిలోని కార్మికుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించడంలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విఫలమైందని ఎఐటియుసి నాయకులు రామారావు, బొబ్బిలి, లక్ష్మణ్‌ ఆరోపించారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు 72 హామీలు ఇచ్చి గెలుపొందిన ఆ సంఘం ఐదు నెలలవుతున్నా ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా సింగరేణి యాజమాన్యానికి వత్తాసు పలుకుతోందని వారు విమర్శించారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 25శాతం వాటా చెల్లించి, కార్మికులకు సంవత్సరానికి రాయితీపై 12 సిలిండర్లు, ఇండిపెండెంట్‌ ఉద్యోగాలు లాంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం తొలుత 420 కోట్ల రూపాయల మేర లాభాలు వచ్చాయని ప్రకటించి తరువాత కేవలం 356 కోట్లు మాత్రమే లాభాలు వచ్చాయని ప్రకటించడం గుర్తింపు సంఘం వైఫల్యమే కారణమని దుయ్యబట్టారు. ఇప్పటికైనాగుర్తింపు సంఘం కార్మికుల సమస్యలపై స్పందించకపోతే వారి పనితీరును ఎండగడతామని, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.