సమస్యల కోరల్లో పందిపంపుల గిరిజన ప్రభుత్వ పాఠశాల
బయ్యారం, జులై 18(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని అల్లిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పంది పంపుల గిరిజన పాఠశాల నూతన భవనం నిర్మించాలని విద్యార్థులు,వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడగానే భవనాలు కురవడం,గోడల మీద పెచ్చలు ఊడి పిల్లల పైన పడటం చాలా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.గిరిజన పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మోకాల మురళీకృష్ణ మాట్లాడుతూ… విద్యా సంవత్సరం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ అందించలేదని విమర్శించారు. పాఠశాలలో 2 సబ్జెక్ట్ లు మాత్రమే పాఠ్యపుస్తకాలు అందించారని, మిగతా సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాలు ఇంకా ముద్రణ కూడా ప్రారంభం చేయలేదని అన్నారు. సమస్యల వలయంలో గిరిజన పాఠశాలలు చిక్కుకొని ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు, మంచినీటీ సౌకర్యం, పాఠశాల గదులు సరిపడాలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని అన్నారు.చాలీచాలని నిధులతో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారని, మధ్యాహ్నం భోజనానికి అధిక నిధులు పెంచి నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. మండలం లో ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ… పాఠశాల పరిస్థితి దయనీయంగా ఉందని, ఆఫీసులోని రికార్డులు, ముఖ్యమైన డాకుమెంట్స్ వర్షంతో పూర్తిగా తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.పైకప్పు నుండి పెచ్చులు ఊడిపోతుంటే పిల్లలు బిక్కు బిక్కుమంటున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో దిక్కు తోచని స్థితిలో పాఠశాల ఉన్నదని, దీనిపై సంబందిత ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు,తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.