సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ఆదిలాబాద్, నవంబర్ 6 : విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పరిష్కారం కానందునే దీక్షలకు పూనుకున్నామని వారు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ముందు తొమ్మిది రోజుల పాటు దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తొలగించిన కాంట్రాక్టు జూనియర్ లైన్మెన్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, విధి నిర్వహణలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని, హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికుల అర్హతను బట్టి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.